New Delhi, June 02: కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు మరో షాక్ ఇచ్చింది. వంట గ్యాస్ సబ్సిడీపై (Gas Subsidy) కేంద్రం కీలక ప్రకటన చేసింది. వంట గ్యాస్ పై సబ్సిడీ (Subsidy)ఎత్తివేస్తునట్టు తెలిపింది. దీంతో ఇకపై మార్కెట్ రేటుకే సిలిండర్ కొనాల్సి ఉంటుంది. గృహ వినియోగదారులకు ఇచ్చే గ్యాస్ సబ్సిడీకి మంగళం పాడిన కేంద్రం.. ఉజ్వల (Ujwala) లబ్దిదారులకు మాత్రమే సబ్సిడీని పరిమితం చేసింది. కేంద్రం నిర్ణయంతో 21 కోట్ల మందికి సబ్సిడీని దూరం చేసినట్లు అవుతుంది. కొన్ని రోజులుగా సబ్సిడీని భారీగా తగ్గించిన కేంద్రం.. కొంతకాలంగా రూ.40 వరకు సబ్సిడీ ఇచ్చేది. ఇప్పటినుంచి అది కూడా నిలిచిపోనుంది.
గతంలో గ్యాస్ బండపై రూ.200 వరకు సబ్సిడీ వచ్చేది. తర్వాత దాన్ని గణనీయంగా తగ్గిస్తూ వచ్చారు. తర్వాత కొన్ని నెలలుగా ఒక్కో సిలిండర్ పై రూ.40 వరకు సబ్సిడీ (Subsidy) మొత్తాన్ని వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేసేవారు. ఇప్పుడు దాన్ని కూడా పూర్తిగా ఎత్తివేసింది కేంద్రం. ప్రస్తుతం దేశంలో 300 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. అందులో ఉజ్వల కనెక్షన్లు కేవలం 9 కోట్లు మాత్రమే. అంటే మిగిలిన 21 కోట్ల మంది మార్కెట్ రేటుకి అనుగుణంగా గ్యాస్ బండ కొనాల్సి ఉంటుంది. ఇటీవలే కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించింది. వినియోగదారులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేలోపే కేంద్రం మరో రూపంలో బాదేసింది.
దేశంలో కరోనా (Corona) ఉధృతి ప్రారంభమైన 2020 జూన్ నుంచి వంట గ్యాస్ పై సబ్సిడీ నిలిపివేశామని కేంద్రం వెల్లడించింది. అయితే ఉజ్వల పథకం కింద కనెక్షన్ తీసుకున్న వారికి మాత్రం సిలిండర్ కు రూ.200 చొప్పున ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీ లభిస్తుందని స్పష్టం చేసింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 9 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని, దీనివల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.6వేల 100 కోట్ల భారం పడుతోందని కేంద్రం చెప్పింది.