Lucknow, August 15: యూపీలోని (Uttar Pradesh) లక్నో (Lucknow)లో దారుణం ఘటన చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో తన భార్యకు విపరీతమైన ఫాలోయింగ్ (following) ఉండటాన్ని తట్టుకోలేకపోయిన ఓ భర్త.. తన భార్యను కన్నబిడ్డల ఎదుటే గొంతు నులిమి చంపేశాడు.
యూపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 37 ఏళ్ల వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లల (12 ఏళ్ల అమ్మాయి, 5 ఏళ్ల బాలుడు)తో కలిసి లక్నోలోని పారా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతడు ట్రావెల్ ఏజెన్సీని నడుపుతుండగా.. భార్య ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయితే, ఆమె తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుంచి భర్తను బ్లాక్ చేసింది. ఈ విషయం అతనికి అభద్రతా భావన కలిగించింది. తాను ఇంట్లో లేని సమయంలో తన భార్యను కొందరు సోషల్ మీడియా ఫాలోవర్స్ కలుస్తున్నారన్న అనుమానం ఏర్పడింది. ఈ విషయం భార్య, భర్తల మధ్య గొడవకు దారి తీసింది.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం పిల్లలతో కలిసి రాయ్ బరేలీకి వెళ్లేందుకు దంపతులు ఇంటి నుంచి ఎస్‌యూవీ వాహనంలో బయలుదేరారు. అయితే రాయ్‌బరేలీకి కాకుండా పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేకి తమ వాహనాన్ని మళ్లించారు. నిందితుడు మధ్యలో సుల్తాన్‌పూర్‌లోని ముజేష్ కూడలి దగ్గర కారు ఆపాడు. అక్కడ తన భార్యతో సోషల్ మీడియా వ్యవహారంపై వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆవేశంతో పిల్లల ఎదుటే భార్య గొంతు నులిమి చంపేశాడు. ఆ సమయంలో కారులోనే ఉన్న పిల్లలు ఈ ఘటనను చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తల్లి మరణంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
అయితే వాహనం అనుమానాస్పదంగా పార్క్ చేయడాన్ని గుర్తించిన యూపీఈఐడీఏ (UPEIDA)కు చెందిన పెట్రోలింగ్ బృందం.. స్థానిక పోలీసులను అప్రమత్తం చేసింది. వెంటనే ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. తండ్రే తన తల్లిని హత్య చేశాడన్న నిజాన్ని దంపతుల కుమార్తె పోలీసులకు వివరించింది. ఆమె వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ మహిళ సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్‌లో ఉందని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వారు తెలిపారు.