Bhopal, November 23: దేశంలోని అతి పెద్ద జాతీయ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరోసారి డొల్లతనం బయటపడింది. బ్యాంకు సిబ్బంది చేసిన పొరపాటుకు ఖాతాదారుడు రూ. 89 వేల వరకు లాస్ అయ్యాడు. ఆలస్యం చేయకుండా వివరాల్లోకెళితే మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లా(Madhya Pradesh’ Bhind district)లో గల స్టేట్ బ్యాంకులో ఇద్దరు వ్యక్తులు అకౌంట్ ఓపెన్ చేశారు.
రురై గ్రామానికి చెందిన హుకుం సింగ్ అలాగే రుని గ్రామానికి చెందిన హుకుంసింగ్ ఇద్దరూ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఇద్దరి పేర్లు ఒకేలా ఉండటంతో బ్యాంకు సిబ్బంది ఇద్దరికీ ఒకే అకౌంట్ నంబర్ ( two accounts with the same number) కేటాయించారు. దీంతో ఒకరు దాచుకున్న డబ్బు మరొకరి అవసరానికి ఉపయోగపడ్డాయి.
తన ఖాతాలో డబ్బు మాయమవుతుందని తెలుసుకున్న హుకుంసింగ్ బ్యాంకు సిబ్బందిని సంప్రదించగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకునేందుకు రురై గ్రామానికి చెందిన హుకుం సింగ్ (Hukum Singh, a resident of Rurai village) బ్యాంకుకు వెళ్లగా అందులో కేవలం రూ. 35 వేలు మాత్రమే ఉన్నట్లు గ్రహించాడు.
మిగతా రూ.89 వేలు ఏమయ్యాయని బ్యాంకు వారిని అడగడంతో జరిగిన తప్పును తెలుసుకున్నారు. ఈ విషయంపై రుని గ్రామానికి చెందిన హుకుంసింగ్ (Hukum Singh, a resident of Rauni village)ని ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.
ప్రధాని మోడీ ప్రభుత్వం ( Narendra Modi government) నల్లధనాన్ని దేశానికి రప్పించి అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని అనుకున్నానని, నా అకౌంట్లో కూడా డబ్బులు అలాగే వేసారని అందుకే వాటిని తీసుకుని వాడుకుంటున్నానని బదులిచ్చాడు. అతని సమాధానం విన్న బ్యాంకు సిబ్బంది అతని అమాయకత్వానికి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఇప్పటికీ ఇద్దరికీ ఒకే ఖాతాను ఇవ్వడం ఎలా జరిగిందనేది అంతుపట్టడం లేదని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు.