Bhopal, Oct 31: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణంం చోటు చేసుకుంది. ఒక బాలికను కలిసేందుకు బాయ్‌ఫ్రెండ్ నిరాకరించడంతో ఆ బాలికతోపాటు ఆమె ఇద్దరు స్నేహితురాళ్లు కూడా విషం ( Teen girl consumes poison) సేవించారు. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు మరణించగా మరొకరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సెహోర్ జిల్లా అష్టా పట్టణానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఒక స్కూల్‌లో చదువుతున్నది.
బాయ్‌ఫ్రెండ్ కొంతకాలంగా ఆమెతో మాట్లాడం మానేశాడు. దీంతో అతడ్ని స్వయంగా కలిసేందుకు ఆ బాలిక శుక్రవారం స్కూల్ ఎగ్గొట్టింది. క్లాస్‌మేట్స్ అయిన మరో ఇద్దరు బాలికలతో కలిసి వంద కిలోమీటర్ల దూరంలోని ఇండోర్‌కు బస్సులో వెళ్లింది. ఇండోర్‌లో బస్సు దిగిన తర్వాత బాయ్‌ఫ్రెండ్‌కు ఆ బాలిక ఫోన్ చేసింది. అయితే బాయ్‌ఫ్రెండ్ ఆమెను కలిసేందుకు నిరాకరించాడు. దీంతో ఓ పార్కులో వెంట తెచ్చుకున్న విషాన్ని ఆ బాలిక తాగింది. అయితే తన ఇంట్లో సమస్యలు ఉన్నాయంటూ మరో బాలిక కూడా విషం తాగింది. ఇది చూసి మూడో బాలిక కూడా మిగిలిన విషాన్ని సేవించింది.
మరోవైపు విషం సేవించిన ముగ్గురు బాలికలు పార్క్‌లో పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వారిని వెంటనే తొలుత ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఎంవై హాస్పిటల్‌కు తరలించారు. అయితే తొలుత విషం సేవించిన ఇద్దరు బాలికలు మరణించారు. చివరిగా విషం తాగిన బాలిక ప్రాణాలతో బయటపడింది. కాగా, ఆ బాలిక జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పింది. దీంతో ఆమె స్టేట్‌మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలిసి ఇండోర్ చేరుకున్న ముగ్గురు బాలికల తల్లిదండ్రులను కూడా ఆరా తీస్తున్నారు.