Mumbai, Jan 13: మహారాష్ట్ర సోషల్ అండ్ జస్టిస్ మంత్రి, ఎన్సీపీ నేత ధనంజయ్ ముండేపై (Dhananjay Munde) తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 14 ఏళ్లుగా అత్యాచారం చేశారంటూ ఓ గాయని మంగళవారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంత్రిని (Maharashtra social justice minister) బావగా పేర్కొన్న ఆ యువతి బాలీవుడ్‌లో అవకాశాలు ఇప్పిస్తానని తనను లోబర్చుకున్నారని తన ప్రాణాలకు ముప్పు ఉందని, పోలీసులను కాపాడాలని కోరింది. ఇదిలా ఉంటే తాను 14 ఏళ్లుగా అత్యాచారం చేశానని ఆ మహిళ చేసిన ఆరోపణలను మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండే ఖండించారు.
తాను సదరు మహిళతో 2003వ సంవత్సరం నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నానని ధనంజయ్ ముండే వివరణ ఇచ్చారు. మహిళతోపాటు ఆమె సోదరి కలిసి డబ్బు కోసం తనను బ్లాక్ మెయిల్ (blackmailing) చేస్తున్నారని, దీనిపై తాను గత ఏడాది నవంబరు నెలలోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని మంత్రి (NCP leader Dhananjay Munde) చెప్పారు. మహిళతో ఉన్న రిలేషన్ షిప్ ను తన కుటుంబం కూడా అంగీకరించిందని, ఆమె ద్వారా తనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని మంత్రి వివరించారు.
కాగా 2008లో తాను ఒంటరిగా ఇంట్లో ఉండగా మంత్రి ముండే నాపై మొదటిసారి అత్యాచారం చేసి, దాన్ని వీడియో తీశాడు. తీసిన అశ్లీల వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి నాపై పలు సార్లు అత్యాచారం చేశాడు. నన్ను పెళ్లి చేసుకోనని 2019లో ముండే చెప్పాడు అని మహిళ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా పోలీసులు ఈ కేసును నమోదు చేయలేదు.
దీంతో తాము కోర్టు ద్వారా ఫిర్యాదు చేస్తామని మహిళ తరపున న్యాయవాది రమేష్ త్రిపాఠి చెప్పారు. మంత్రి ముండే వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని,తనను పోలీసులు కాపాడాలని బాధిత మహిళ కోరింది.ఈ నేపథ్యంలో మహిళతో తనకు సంబంధం ఉందని మంత్రి ముండే అంగీకరించినా మంత్రివర్గం నుంచి అతన్ని తొలగించాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను బీజేపీ మహిళా విభాగం లేఖలో కోరింది.
అంతా బాగుందనుకున్న సమయంలో తనపై అత్యాచార ఆరోపణలు చేస్తున్నారని, కేవలం డబ్బు గుంజాలన్న ఆశతోనే సదరు మహిళ, ఆమె సోదరితో కలిసి నాటకం ఆడుతున్నదని ధనుంజయ్ విమర్శించారు. మహిళతో సంబంధం ఉందని ధనుంజయ్ ముండే ఒప్పుకున్న నేపథ్యంలో మహారాష్ట్ర మహిళా కమిషన్ ఆయనపై చర్యలకు సిద్ధమైంది. ధనుంజయ్‌ని వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాశారు.
బాధితురాలి తరపు లాయర్ మాట్లాడుతూ.. బాధితురాలికి 1997 నుంచి ధనుంజయ్ ముండేతో పరిచయం ఉందన్నారు. తొలుత బాలీవుడ్‌లో సింగర్‌గా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఆమెతో పరిచయం పెంచుకున్నాడని, ఆ తర్వాత ఆమెను లోబర్చుకున్నాడని ఆయన తెలిపారు. ధనుంజయ్ ముండే తొలిసారి 2008లో తన క్లయింట్‌పై అత్యాచారం చేశాడని ఆమె తరఫు లాయర్ వెల్లడించారు. ఆ తర్వాత ఏళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నాడని, 2019లో ఆమె వివాహం చేసుకోవాలని ఒత్తిడి తేగా ధనుంజయ్ అంగీకరించలేదని చెప్పారు. అంతేకాక ఇద్దరి మధ్య సంబంధం గురించి ఎవరికైనా చెబితే బాధితురాలి నగ్న వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే బాధతురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. కానీ, పోలీసులు ఇప్పటికీ ధనుంజయ్ మీద ఎఫ్‌ఐఆర్ బుక్ చేయలేదని, అందువల్ల తాము కోర్టుకు వెళ్తామని చెప్పారు. బాధితురాలికి ఏదైనా జరిగితే అందుకు ధనుంజయ్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.