Mumbai, Dec 20: మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత గులాబ్ రావ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు (Gulabrao Patil Remarks) చేసిన సంగతి విదితమే. తన నియోజకవర్గంలోని రోడ్లను నటి, ఎంపీ హేమామాలిని బుగ్గలతో పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. వెంటనే తన వ్యాఖ్యలపై ఆయన (Maharashtra minister Gulabrao Patil) క్షమాపణ కోరారు.
మహారాష్ట్ర నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ మంత్రి, శివసేన నాయకుడు గులాబ్రావ్ పాటిల్ ఆదివారం జల్గావ్ జిల్లాలోని ధరంగావ్‌లోని తన నియోజకవర్గంలోని రోడ్లను బాలీవుడ్ స్టార్, బిజెపి ఎంపి హేమమాలిని చెంపలతో ( Hema Malini's cheeks) పోల్చుతూ..ఈ రోడ్లు ఆమె చెంపలు లాగే చాలా మృదువైనవిగా అందంగా ఉన్నాయని చెప్పారు. ”గత 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వారందరూ నా నియోజకవర్గానికి విచ్చేయండి. రోడ్లను చూడండి. హేమామాలిని బుగ్గలు గనక వారికి నచ్చకుంటే నేను రాజీనామా చేసేస్తాను.” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలో వైరల్ గా మారడంతో ఆయన క్షమాపణ కోరారు.
ఈ వ్యాఖ్యలపై ఇవాళ హేమమాలిని ( Hema Malini ) స్పందించారు. రోడ్లను నటీమణుల బుగ్గలతో పోల్చే సాంప్రదాయాన్ని గతంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ మొదలుపెట్టారని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని అందరూ అనుసరిస్తున్నారన్నారు. అయితే ఇలాంటి కామెంట్‌లు మంచివి కావని హేమమాలిని వ్యాఖ్యానించారు. సాధారణ ప్రజలు ఇలాంటి కామెంట్లు చేస్తే పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదని, కానీ గౌరవ హోదాల్లో ఉన్నవాళ్లు, ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదని అన్నారు. మీ బుగ్గలపై కామెంట్ చేసినందుకు గులాబ్‌రావు పాటిల్‌ను క్షమాపణ కోరుతారా..? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తాను ఆ వ్యాఖ్యలను పట్టించుకోనని హేమమాలిని స్పష్టంచేశారు.