Mumbai, Dec 6: మహారాష్ట్రలో (Maharashtra Shocker) దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పారిపోయి పెళ్లిచేసుకుందనే ఆక్రోశంతో అక్కను చంపేశాడు ఓ కసాయి తమ్ముడు. ఈ ఘోరానికి తల్లి కూడా సహకరించడం దారుణమైన ( Brother beheads pregnant sister) విషయం. ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఔరంగబాద్ జిల్లాకు (Aurangabad district) చెందిన 19 ఏళ్ల కీర్తి థోర్ అనే యువతి ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లో వారిని ఎదురించి ఈ జూన్‌లో పారిపోయి పెళ్లి చేసుకుంది.
ప్రస్తుతం గర్భవతి అయిన ఆ యువతి వైజాపూర్‌లో తన భర్తతో కలిసి జీవిస్తోంది. ఇటీవల తల్లి తన కూతురు ఇంటికి వచ్చి యోగక్షేమాలు తెలుసుకొని వెళ్లింది. మరోసారి తన కొడుకుని వెంట పెట్టుకొని కూతురు ఇంటికి వచ్చింది. అత్తగారితో కలిసి పొలంలో పని చేస్తున్న కీర్తి.. తన తల్లీ, తమ్ముడు వచ్చారని తెలుసుకుని ఇంటికి పరుగున వచ్చింది. వారిని పలకరించిన తరువాత ఇద్దరికీ నీళ్ళు ఇచ్చి, టీ చేయడానికి వంటింట్లోకి వెళ్లింది.
ఆ సమయంలో అల్లుడికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో అతను వేరే గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన తల్లి, తమ్ముడు కోసం కీర్తి టీ తయారు చేస్తుండగా .. అక్కపై వెనక నుంచి తమ్ముడు కత్తితో దాడి చేశాడు. ఈ దారుణ ఘటనకు తల్లి కూడా కీర్తి కాళ్లు అదిమి పట్టుకొని కొడుక్కి సాయం చేసింది. దీంతో తన వెంట తెచ్చుకున్న పదునైన కొడవలితో గర్భవతి అని కూడా కనికరం లేకుండా దారుణంగా తలను నరికివేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న కీర్తి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది.
వంటింట్లో పాత్రలు పడిపోతున్న శబ్దం విని అనారోగ్యంతో పడుకున్న కీర్తి భర్త నిద్రలేచి వంటగదిలోకి పరిగెత్తాడు. ఈ నేపథ్యంలో నిందితుడు తన బావను కూడా చంపడానికి ప్రయత్నించగా.. అతను తప్పించుకున్నాడు. తరువాత తెగిన కీర్తి తలతో ఆమె తమ్ముడు, తల్లి సెల్ఫీ తీసుకున్నారు. చేతిలో తలను పట్టుకొని ఇంటి నుంచి బయటకు వచ్చి చూపుతూ స్థానికులకు భయాందోళనలకు గురిచేశాడు. అనంతరం నిందితుడు తన తల్లితో కలిసి విర్గావ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.