New Delhi, Jan 8: ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ క్రమంలో మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. వివాదంపై రెండు దేశాలు సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు.మరో ఇద్దరు భారత్ ను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై భారత్ లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో ఆ ముగ్గురు మంత్రులను అక్కడి ప్రభుత్వం పదవుల నుంచి (Maldives Government Suspends Ministers) తప్పించింది.
దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్(EaseMyTrip) ఆ దేశానికి ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టి ఎక్స్‌లో పోస్టు పెట్టారు.దానికి చలో లక్షద్వీప్(Chalo Lakshadweep) హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. ఈ సంస్థ ఢిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తోంది. నిషాంత్ పిట్టి, రికాంత్ పిట్టి, ప్రశాంత్ పిట్టి దీనిని 2008లో స్థాపించారు.