Goa, July 01: ఒక వ్యక్తి మృతదేహాన్ని గోవాలో గుర్తించారు. అతడి భార్య, కుమారుడి మృతదేహాలు కర్ణాటకలోని బీచ్‌లో లభించాయి. ఆ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు (Mass suicide) పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గోవా రాజధాని పనాజీకి 15 కిలోమీటర్ల దూరంలోని చికాలిమ్ గ్రామానికి చెందిన 50 ఏళ్ల శ్యామ్ పాటిల్ లేబర్ కాంట్రాక్టర్. గురువారం దక్షిణ గోవాలోని క్యూపెమ్ అటవీ ప్రాంతంలో ఒక చెట్టుకు పాటిల్ మృతదేహం (Suicide) వేలాడుతూ కనిపించింది. అదే రోజు కర్ణాటకలోని కార్వార్‌లో ఉన్న దేవ్‌బాగ్ బీచ్‌లో 37 ఏళ్ల భార్య జ్యోతి, 12 ఏళ్ల కుమారుడి మృతదేహాలు లభించాయి. కలకలం రేపిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, లేబర్ కాంటాక్టర్ అయిన శ్యామ్ పాటిల్ పలు బ్యాంకులతోపాటు పలువురి నుంచి భారీగా అప్పులు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో అప్పుల బాధలు తాళలేక అతడి కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి 8.30 గంటలకు ఆ కుటుంబం గోవా నుంచి పొరుగున్న ఉన్న కర్ణాటకలోని కార్వార్‌కు వెళ్లినట్లు పొరుగింటి వారి ద్వారా తెలిసిందన్నారు.
మరోవైపు తన భార్య, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారని, తాను కూడా జీవితాన్ని ముగిస్తున్నట్లు తన స్నేహితుడికి శ్యామ్ పాటిల్ వాయిస్ మెసేజ్ పంపినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లుగా రాసిన సూసైడ్ నోట్ పాటిల్ కారులో లభించినట్లు చెప్పారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.