New Delhi, DEC 07: నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తల్లి నిరాకరించింది. దీనిపై అసంతృప్తి చెందిన కొడుకు ఆమెను హత్య చేశాడు. (Man Kills Mother) దోపిడీ దొంగల పనిగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు అతడ్ని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 22 ఏళ్ల శావన్ పోలీసులకు ఫోన్ చేశాడు. తన ఇంట్లో దోపిడీ జరిగిందని, తల్లి సులోచన చెవిపోగులు చోరీ చేసిన దొంగలు ఆమెను హత్య చేశారని ఆరోపించాడు. కాగా, పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంట్లోని మిగతా వస్తువులు అలాగే ఉండటంతో దోపిడీ జరుగలేదని భావించారు. సులోచన హత్యపై అనుమానం వ్యక్తం చేశారు. ఆమె చిన్న కుమారుడు శావన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అసలు విషయాన్ని బయటపెట్టాడు.
మరోవైపు సులోచన పెద్ద కుమారుడైన 27 ఏళ్ల కపిల్‌కు పెళ్లి సంబంధం కుదిరిందని పోలీసులు తెలిపారు. దీంతో చాలా కాలంగా తెలిసిన అమ్మాయిని తాను కూడా పెళ్లి చేసుకుంటానని శావన్ తల్లితో అన్నట్లు చెప్పారు. దీనికి ఆమె నిరాకరించిందని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో వాటా ఇవ్వనని తెగేసి చెప్పిందన్నారు. ఈ నేపథ్యంలో శావన్ పథకం ప్రకారం తల్లిని హత్య చేశాడని పోలీస్ అధికారి తెలిపారు. ఆ తర్వాత చెవి పోగులు తొలగించి దొంగల పనిగా నమ్మించేందుకు ప్రయత్నించాడని చెప్పారు. శావన్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.