Imphal, May 4: గిరిజనులు వర్సెస్ గిరిజనేతరుల వ్యవహారంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడికి పోతోంది. నిరసనకారులు ప్రార్థనా స్థలాలు, వాహనాలను తగలబెట్టడంతో ఈ ఘర్షణలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆర్మీ, అస్సాం రైఫిల్ బలగాలను రంగంలోకి దింపింది. ఈ క్రమంలో ఆర్మీ మార్చ్ ఫ్లాగ్(Army flag march) నిర్వహించింది. మెజార్టీ మైతై(Meitei) కమ్యూనిటీని షెడ్యూల్ తెగ (Scheduled Tribe)లో చేర్చే చర్యలను వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఈ పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
గిరిజనులు ప్రధానంగా కుకీ వర్గం, గిరిజన హోదా డిమాండ్ చేస్తున్న మెయితీల నడుమ భేధాభిప్రాయలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో అక్కడ అల్లకల్లోలం చెలరేగింది. అయితే అల్లర్లకు మీరు కారణమంటే మీరే కారణమంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి ఆ రెండు వర్గాలు. అల్లర్లతో హింస చెలరేగడంతో.. భారత సైన్యం అక్కడ అడుగుపెట్టింది.
మెయితీల గిరిజన హోదాకి సంబంధించి తాజాగా ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిరసిస్తూ చూరాచంద్‌పూర్‌లో గిరిజన గ్రూపులు చేపట్టిన యాత్ర.. హింసకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజధాని ఇంఫాల్‌తో పాటు చూరాచంద్‌పూర్, కంగ్‌పోక్పి జిల్లాల్లో చెలరేగిన హింసతో కర్ఫ్యూ విధించడంతో పాటు ఇంటర్నెట్‌ను బంద్ చేశారు.
రాజధాని ఇంఫాల్, చురాచాంద్‌పుర్, కాంగ్‌పోక్పిలో ఘర్షణలు జరగడంతో రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ఆర్మీ శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో నాలుగువేల మంది ప్రజలకు ఆశ్రయం కల్పించారు.కల్లోల స్థితిని అదుపు చేసేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. ఈ ఉదయం(గురువారం) హింస చెలరేగిన ప్రాంతంలో కవాతు నిర్వహించింది. ఆర్మీతో పాటు అస్సాం రైఫిల్స్ శాంతి భద్రతల్ని పర్యవేక్షిస్తున్నాయి.
ఇంటర్నెట్‌ను బంద్ చేయడంతో పాటు 144 సెక్షన్‌కు పక్డబందీగా అమలు చేస్తున్నారు అక్కడ. చురాచాంద్‌పూర్ జిల్లా రెవెన్యూ పరిధిలోని ఆస్తులు, ప్రాణాలకు ముప్పు ఉందని, శాంతికి విఘాతం కలిగే అవకాశం ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. బయట వ్యక్తులను ఎవరినీ రానీయకుండా సంపూర్ణ కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపింది.
ప్రస్తుతం పరిస్థితులపై ప్రముఖ బాక్సర్ మేరీకోమ్(Mary Kom) ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘మా రాష్ట్రం మండిపోతోంది. సహాయం చేయండి’ అని ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాను అభ్యర్థించారు. ఈ హింసపై అమిత్ షా.. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌తో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రం సునిశితంగా గమనిస్తోందని వెల్లడించారు.
మణిపుర్ జనాభాలో 53 శాతం మంది మైతై వర్గానికి చెందినవారే. మణిపుర్ వ్యాలీలో వారి ప్రాబల్యం ఎక్కువ. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వస్తోన్న అక్రమ వలసదారులతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లో నివసించేందుకు మైతై వర్గానికి అనుమతి లేదు. మణిపుర్(Manipur)లో రెండో అతిపెద్ద పట్టణమైన చురాచాంద్‌పుర్ ఈ ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి బీరేన్ సింగ్(N.Biren Singh) పాల్గొనాల్సిన సభకు చెందిన వేదికను ఆ ప్రాంతంలో నిరసనకారులు దహనం చేసిన సంగతి తెలిసిందే.