Lalu Prasad Yadav Health Update: విషమించిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం, ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిట‌ల్‌‌కు తరలించే అవకాశం, లాలూ ఆరోగ్య పరిస్థితిపై మెడికల్ బోర్డ్ ఏర్పాటు
RJD Chief Lalu Prasad Yadav | File Image | (Photo Credit: Facebook)

Patna, Jan 23: ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం విషమించింది. దీంతో చికిత్స కోసం ఆయ‌న్ను ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించేదుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. రాంచీలోని హాస్పిట‌ల్‌లో ఆయ‌న ప్ర‌స్తుతం ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్‌కు చికిత్స తీసుకుంటున్నారు. దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్‌ కురు వృద్దునికి (Lalu Prasad Yadav Health Update) ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ రావడంతో గత మూడు రోజులుగా ఆరోగ్యం మరింత క్షీణించింది. అయితే ఆయనకు కోవిడ్-19 నెగెటివ్ అని నిర్థరణ అయింది.

జైలు అధికారుల సమాచారం మేరకు తేజస్వీ యాదవ్‌, తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, రబ్రీదేవి శుక్రవారం రాత్రి రాంచీ చేరుకుని ఆయన్ని (Lalu Prasad Yadav) పరామర్శించారు. ఈ సందర్భంగా తన తండ్రికి మెరుగైన ఆరోగ్యం అందించాలని తేజస్వీ యాదవ్‌ (RJD leader Tejashwi Yadav) జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరెన్‌ను కోరారు. దీంతో వైద్యుల సూచనల మేరకు శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.

లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీలు ప్రస్తుతం 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని, మెరగైన వైద్యం కోసం ఢిల్లీ తరలిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై లాలూ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అనారోగ్య పరిస్థితుల కారణంగా లాలూకు వెంటనే బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన తరుఫు న్యాయవాదులు పట్నా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణలో ఉంది. కాగా లాలూను ఢిల్లీ ఎయిమ్స్‌కు పంపాల‌ని రాజేంద్ర ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ వైద్యులు జైలు అధికారుల‌కు సూచించారు. ఛాతిలో నొప్పి వ‌స్తున్న‌ట్లు గురువారం లాలూ ఫిర్యాదు చేశారు.

హనుమంతుడు కోవిడ్ సంజీవనిని బ్రెజిల్ దేశానికి తీసుకువెళ్లాడు, ధన్యవాద్ భారత్ అంటూ ట్వీట్ చేసిన బ్రెజిల్ ప్రధాని జైర్ బొల్సనారో, రిప్లయి ఇచ్చిన ప్రధాని మోదీ

ఇదిలా ఉంటే రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక కోసం శనివారం మెడికల్ బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. ఆయనను ఎనిమిది మందితో కూడిన ఈ నిపుణుల బృందం పరీక్షించి, నివేదికను సమర్పిస్తుంది. అనంతరం ఆయనను ఢిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్)కు తరలించడంపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. జార్ఖండ్ జైళ్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) బీరేంద్ర భూషణ్ మాట్లాడుతూ, లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిని జైలు అధికారులకు వివరించేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

లాలూకు రెండు రోజుల నుంచి ఊపిరి సంబంధిత సమస్యలు వచ్చినట్లు రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయనకు న్యూమోనియా వచ్చినట్లు గుర్తించామన్నారు. ఆయనకు మరింత మెరుగైన చికిత్సను అందించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు ఆయనను తరలించాలని నిర్ణయించామని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులు, అధికారులు ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మెడికల్ బోర్డ్ నివేదిక అందిన వెంటనే లాలూను ఎయిమ్స్‌కు తరలిస్తారు. ఆయనను ఎయిమ్స్‌కు తరలించాలంటే జైలు అధికారులు సీబీఐ కోర్టు అనుమతి పొందవలసి ఉంటుంది.

ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్న లాలూకు చికిత్స జరుపుతున్న ఫిజిషియన్ డాక్టర్ ఉమేశ్ ప్రసాద్ గత నెలలో తెలిపిన వివరాల ప్రకారం, లాలూ మూత్ర పిండాలు 25 శాతం సామర్థ్యంతో మాత్రమే పని చేస్తున్నాయి. ఈ పరిస్థితి విషమించే అవకాశం ఉందని డాక్టర్ ఉమేశ్ అప్పట్లో తెలిపారు.