Union Coal Minister G Kishan Reddy (photo-ANI)

New Delhi, FEB 01: బడ్జెట్‌లో తెలంగాణకు ఏం ఇచ్చారని కొందరు అడుగుతున్నారని.. అది రాష్ట్ర బడ్జెట్‌ కాదన్న విషయం గుర్తించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కిషన్‌రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బడ్జెట్ ఎంతో ప్రత్యేకమైనదని, పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పనకు మోదీ ప్రభుత్వం (Modi Govt) పెద్దపీట వేసిందన్నారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగులకు ఎంతో మేలు చేసేలా బడ్జెట్‌ ఉందన్నారు. రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్నును ప్రభుత్వం మినహాయింపును ఇచ్చి.. మధ్య తరగతికి గొప్ప ఊరటనిచ్చిందని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా వేసిన తొలి అడుగుగా పేర్కొన్నారు.

Union Budget 2025 Highlights: రూ. 50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్ సమగ్ర స్వరూపం ఇదే, రక్షణ రంగానికే ఎక్కువ ప్రాధాన్యం, రంగాల వారీగా బ‌డ్జెట్ కేటాయింపులు, నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగం హైలెట్స్ మీకోసం.. 

తెలంగాణకు (Telangana) ఏం ఇచ్చారని అడిగేందుకు ఇది కేవలం రాష్ట్ర బడ్జెట్‌ కాదని.. కేంద్రం అమలు చేసే అన్ని పథకాల్లో తెలంగాణకు సైతం భాగస్వామ్యం ఉంటుందన్నారు. రాబోయే ఐదేళ్లలో ఎంఎస్ఎంఈలకు బడ్జెట్‌లో రూ. 1.50 లక్షల కోట్లు కేటాయించారని, ఇందులో తెలంగాణకు సైతం లబ్ధి జరుగుతుందన్నారు. స్టార్టప్ కంపెనీలకు రూ.10 వేల కోట్లతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారని, అందులోనూ తెలంగాణ స్టార్టప్ కంపెనీలకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. 50 ఏళ్ల వరకు వడ్డీ లేని రుణాలతో తెలంగాణకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కేంద్రం ఏ సంస్కరణ తీసుకొచ్చినా.. తెలంగాణకు, రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఉందని చెప్పారు. అర్బన్ స్టేట్‌గా ఉన్న తెలంగాణకు రూ.10 వేల కోట్లు రానున్నాయని.. అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి లబ్ధి జరుగుతుందని వివరించారు.