Tripura, NOV 06: డ్రగ్స్‌కు (Drugs) బానిసైన ఒక కుర్రాడు సొంత కుటుంబాన్నే హత్య చేశాడు. ఈ దారుణ ఘటన త్రిపురలోని (Tripura), దాలై జిల్లా, కమలాపూర్ పరిధిలోని ఒక గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పదహారేళ్ల కుర్రాడు (Minor Boy) శనివారం ఉదయం తన తల్లిని, పదేళ్ల చెల్లిని, తాతను హత్య చేశాడు. ఈ ఘటనలో అడ్డొచ్చిన.. ఇంటి పక్కనే ఉండే మరో వ్యక్తిని కూడా హత్య చేశాడు. అలా మొత్తం నలుగురిని హత్య (Murdering 4 Of Family) చేశాడు.
ఆ తర్వాత వారి మృతదేహాల్ని ఇంట్లో ఉన్న బావిలో పడేశాడు. అనంతరం అక్కడ్నుంచి పారిపోయాడు. ఆ సమయంలో బాలుడి తండ్రి ఇంట్లో లేడు. బయటకు వెళ్లాడు. తర్వాత అతడు ఇంటికి వచ్చి చూసేసరికి ఇల్లంతా రక్తపు మరకలు కనిపించాయి. వాటిని అనుసరిస్తూ వెళ్లి చూడగా బావిలో తన కుటుంబ సభ్యుల మృతదేహాలు కనిపించాయి. వెంటనే విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. తన కొడుకే హత్య చేసుంటాడని అనుమానించాడు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుడి కోసం గాలించి, అదుపులోకి తీసుకున్నారు. బావిలోంచి మృతదేహాల్ని వెలికితీసి, పోస్టుమార్టమ్ కోసం తరలించారు. కాగా, ఈ హత్యలకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
అయితే, శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో నిందితుడు తన ఇంట్లో లౌడ్ స్పీకర్లు పెట్టాడని, పెద్దగా శబ్దం రావడంతో ఇంట్లో ఏం జరుగుతుందో తెలియలేదని గ్రామస్తులు తెలిపారు. తమ దృష్టి మరల్చేందుకే నిందితుడు పెద్ద శబ్దం పెట్టాడని వారు అన్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితుడి విచారణ కొనసాగుతోంది.