శివమొగ్గ: కర్ణాటకలో శివమొగ్గలో దారుణ ఘటన జరిగింది. మైనర్ అయిన భార్య చెల్లెలిని మాయమాటలతో లోబరుచుకుని ఆమెను గర్భవతిని చేశాడో కీచక బావ. సదరు బావ మీద జిల్లాలోని కుంసి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అక్క-బావ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్న బాలికను తోబుట్టువుల చూసుకోవాల్సిన బావ ఆమె మీద కన్నేశాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకుని లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నాడు.
ఇటీవల బాలికకు అనారోగ్యంగా ఉండటంతో అక్క చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ బాలిక ఏడు నెలల గర్భవతి అని వైద్యులు తెలిపారు. దీంతో అక్క షాక్ కు గురైంది. తరువాత బాలిక ద్వారా జరిగిన విషయం తెలుసుకుంది. బయటికి పొక్కితే సంసారం ఇబ్బందుల్లో పడుతుందనుకుందో ఏమో.. బాలికకు 18 ఏళ్లు నిండాయని చెప్పి.. గొడవలు లేకుండా ఇంటికి తీసుకువచ్చారు. అనంతరం బాలికకు నొప్పులు రాగా మెగ్లాన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఏడు నెలలకే ప్రసవం కాగా బిడ్డ మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు సదరు కీచక బావపై అత్యాచారం కేసు నమోదు చేసి కటకటాల్లో కి తరలించారు.