New Delhi, March 08: లోక్‌సభ ఎన్నికల తర్వాత డీప్ ఫేక్ (Deep fake)లను కట్టడి చేయడానికి నిబంధనలు తయారు చేస్తామని, అవసరమైతే కొత్త చట్టం తెస్తామని కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) చెప్పారు. డీప్ ఫేక్‌లు ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించాయని, వీటిని అరికట్టేందుకు తగిన పరిష్కారాలు కనుక్కోవాలని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ప్రతినిధులను కోరారు. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాల్లో డీప్ ఫేక్‌ల (Deepfakes) వ్యాప్తి సమాజానికి హాని చేస్తుందని, మన దేశ భవిష్యత్‌పై ప్రభావితం చూపుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఎన్నికల తర్వాత ఇందుకు అవసరమైన నిబంధనలను ఖరారు చేస్తామని, అవసరమైతే కొత్త చట్టం కూడా తెస్తామన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో సవాళ్లు విసురుతున్నాయి. ఎన్నికల వేళ డీప్ ఫేక్‌లు (Deepfakes) ఇవి ప్రమాదకర స్థాయికి దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం అవుతున్నది. దీంతో సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో సమావేశమైన కేంద్ర ప్రభుత్వం.. ఆయా తప్పుడు సమాచారాన్ని ప్లాట్ ఫామ్ నుంచి తొలగించాలని ఆదేశించింది.