New Delhi, December 16: మొబైల్ నంబర్‌ను పోర్ట్ చేయడానికి ఇకపై వారాల తరబడి రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఒకే సర్కిల్‌లో అయితే కేవలం 3 రోజుల్లోనే నెంబర్ పోర్టబిలిటీ (Mobile Number Portability) ప్రక్రియను పూర్తి చేయవచ్చు. నేటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నూతన నిబంధనలతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)(Telecom Regulatory Authority of India) మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పి) ప్రక్రియను సులభతరం చేసింది.
సబ్‌స్క్రైబర్ తన మొబైల్ నంబర్‌ను(mobile number) పోర్ట్ చేయడానికి అర్హతలు కలిగి ఉంటే టెలికాం రెగ్యులేటర్ ప్రత్యేకమైన పోర్టింగ్ కోడ్ (యుపిసి)ని అందిస్తుంది. కస్టమర్‌కు మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి అర్హత ఉందా లేదా అనేది ట్రాయ్ నిర్ణయిస్తుంది.
ఇదిలా ఉంటే పోస్ట్ పెయిడ్ కస్టమర్లు తాము చెల్లించాల్సిన బకాయిలు చెల్లించిన తర్వాతే ఎంఎన్‌పీకి అనుమతి లభిస్తుంది. పూర్తి కాకుండా మొబైల్ నంబర్ ఓనర్‌షిప్‌ను మార్చాలని అప్పటికే కోరిన పక్షంలో పోర్టబిలిటీకి ఆ నంబర్‌ను అనుమతించరు.
దీంతో పాటుగా చట్టనిబంధనల ప్రకారం నిషేధానికి గురైన మొబైల్ నంబర్‌ను కూడా ఎంఎన్‌పీకి అనుమతించరు. న్యాయస్ధానాల పరిధిలో ఉన్న మొబైల్ నెంబర్‌కూ ఎంఎన్‌పీని అనుమతించరు. ఆయా మొబైల్ ఆపరేటర్లతో ఎగ్జిట్ క్లాజ్‌లో కాంట్రాక్టులో పొందుపరిచిన అంశాలను పరిష్కరించకుండా ఉంటే ఎంఎన్‌పీ వర్తించదు.
ప్రతి పోర్టింగ్ విజ్ఞప్తికి ట్రాయ్ రూ 6.46లను లావాదేవీ ఫీజుగా వసూలు చేస్తుంది. వ్యక్తిగత యూజర్ల పోర్టింగ్ వినతిని యూపీసీ వ్యాలిడిటీ ముగిసే వరకూ తిరస్కరించరాదని ట్రాయ్( TRAI) స్పష్టం చేసింది. ఇక కార్పొరేట్ సంస్థలు యూజర్ల కార్పొరేట్ మొబైల్ నంబర్ల పోర్టింగ్ కోసం అధికారికంగా లేఖను ఇవ్వాల్సి ఉంటుంది. అదే సర్కిల్‌లో నంబర్ పోర్టింగ్‌కు మూడు పనిదినాలు, వేరే సర్కిల్‌లో అయితే అయిదు పనిదినాల్లో ఈ ప్రక్రియ ముగుస్తుందని ట్రాయ్ పేర్కొంది.