Bhainsa Violence Row: భైంసా పట్టణంలో పర్యటించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, భైంసా హింసాకాండపై అవసరమైతే హైలెవెల్ ఎంక్వైరీ కమిటీతో విచారణ జరిపిస్తామని వెల్లడి
G Kishan Reddy (Photo Credits: ANI)

Bhainsa, February 17: ఇటీవల మత ఘర్షణలకు గురైన తెలంగాణలోని భైంసా పట్టణాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి సందర్శించారు. ఘర్షణల్లో ధ్వంసమైన బాధితుల ఇళ్లను పరిశీలించిన ఆయన, వాటి పునర్మిణాల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సహాకారం అందిస్తామని వారికి హామీ ఇచ్చారు. తన ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

కిషన్ రెడ్డి పర్యటన సందర్భంగా బాధితులు తమ గోడును మంత్రి వద్ద వినిపించారు. వందల మంది ఒక్కసారి ఇండ్లల్లోకి చొరబడి దాడి చేశారు, పెట్రోల్ బాంబులు విసురుతూ ఇండ్లను వాహానాలను తగలబెట్టారు. పండగ కోసం చేసుకున్న పిండివంటలపై మూత్ర విసర్జన చేశారని తమ ఆవేదనను మంత్రితో పంచుకున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే కావాలనే దాడి చేసినట్లు స్థానికులు వివరించారు.

అనంతరం మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అవసరమైతే 'భైంసా ఘర్షణలపై' హైలెవల్ ఎంక్వైరీ కమిటీ వేస్తామని అన్నారు. హింసాకాండలో 100 మందికి పైగా బాధితులు ఉన్నారు, కనీసం రూ. 2.33 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు మంత్రి పేర్కొన్నారు. జిల్లా పోలీసు అధికారులతో కూడా సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి, ఈ ఘటనల్లో డీఎస్పీ మరియు సిఐలకు కూడా గాయాలవడం అంటే పరిస్థితి తీవ్రత ఏంటో తనకు అర్థమవుతుందని చెప్పారు. ఈ అల్లర్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. నిందితుల్లో ఏ రాజకీయ పార్టీకి చెందిన వారున్నా, విడిచి పెట్టవద్దని స్పష్టం చేశారు.

కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు అర్వింద్, బండి సంజయ్, సోయం బాపురావు మరియు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే.లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. బాధితులందరికీ అన్ని రకాల న్యాయం చేస్తామని ఈ సందర్భంగా వారికి హామి ఇచ్చారు. ఇంతజరిగినా అధికార టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదని బీజేపీ నేతలు నిప్పుచెరిగారు. ఈ ఘర్షణలు మజ్లిస్ పార్టీ కుట్ర అంటూ, టీఆర్ఎస్ అండతోనే AIMIM రెచ్చిపోతుందని వారు ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు దమ్ముంటే భైంసా రావాలని ఎంపీ బండి సంజయ్ సవాల్ చేశారు.  భైంసా మున్సిపల్ పోల్స్‌లో బీజేపీతో జరిగిన హోరాహోరీ పోరులో ఎంఐఎం పైచేయి, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గల్లంతు

నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో గతనెల జనవరి 12న ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో అల్లరిమూకలు ఇండ్లకు, వాహనాలకు నిప్పుపెట్టడంతో రాళ్లు రువ్వుతూ, ఆస్తులను ధ్వంసం చేస్తూ బీభత్స సృష్టించారు. ఈ ఘర్షణల్లో 8 మంది పోలీసు అధికారులు సహా 19 మంది గాయపడ్డారు. అదనపు బలగాలను రప్పించి, పరిస్థితిని తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు 10కి పైగా కేసులను నమోదు చేసి, ఇరు వర్గాలకు చెందిన 60 మందికి పైగా అరెస్టు చేశారు.