Mumbai, April 2: భర్త రోడ్డు ప్రమాదంలో మరణించిన తరువాత భార్య రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ బీమా కంపెనీ ఆమెకు రావాల్సిన పరిహారం చెల్లించాల్సిందేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. 2010లో ముంబై-పుణె హైవేపై బైక్‌పై వెళ్తూ మరణించిన గణేశ్ అనే ఓ వ్యక్తి కేసులో న్యాయస్థానం ఈ కీలక తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం మోటర్ వాహనాల చట్టాన్ని గుర్తుచేసింది.
దీని ప్రకారం.. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి భార్య వేరే వ్యక్తిని పెండ్లి చేసుకొన్నప్పటికీ, బీమా కంపెనీ ఆమెకు పరిహారం చెల్లించాల్సిందేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. రెండో పెండ్లిని సాకుగా చూపుతూ పరిహారం ఇవ్వలేం అంటే కుదరదని న్యాయమూర్తి జస్టిస్ ఎస్జీ దిగే పేర్కొన్నారు. ఈ మేరకు న్యాయస్థానం ఇన్సూరెన్స్ కంపెనీకి తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. 2010లో ముంబై-పుణె హైవేపై బైక్‌పై వెళ్తూ గణేశ్ అనే ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ నేపథ్యంలో అతని భార్యకు పరిహారం ఇవ్వాలని మోటర్ యాక్సిడెంట్స్ క్లెయిమ్ ట్రిబ్యునల్(ఏంఏసీటీ) గతంలో ఆదేశించింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఇఫ్కో-టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది. గణేశ్ మరణం తర్వాత అతని భార్య రెండో వివాహం చేసుకొన్నారని, ఆమెకు పరిహారం పొందే అర్హత లేదని వాదించింది. అయితే బీమా కంపెనీ వాదనను తిరస్కరించిన కోర్టు, తన భర్త మరణానికి పరిహారం పొందేందుకు జీవితాంతం లేదా పరిహారం వచ్చే వరకు ఆమె వితంతువుగా ఉండాలని ఆశించలేమని పేర్కొన్నది.