Bhopal, NOV 20: అటవీ ప్రాంతంలో 80 ముక్కలుగా వ్యక్తి అస్థిపంజరం (Skeleton) లభించింది. తొమ్మిది నెలలపాటు దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు హత్య మిస్టరీని (murder mystery) ఛేదించారు. ఒక నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో (Rewa) ఈ సంఘటన జరిగింది. చుయియా గ్రామానికి చెందిన 21 ఏళ్ల వికాస్ గిరి, 2021 అక్టోబర్‌లో అదృశ్యమయ్యాడు. దీంతో ఆ యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుధ్మునియా అడవి ప్రాంతంలో పశువులు మేపే కొందరు అక్కడ ఒక అస్థిపంజరం (skeleton), ఆధార్ కార్డును గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి 80 ముక్కలున్న అస్థిపంజరాన్ని వెలికితీశారు. మృతుడు వికాస్ గిరిగా (Vikas Giri) గుర్తించారు. అనంతరం ఆ యువకుడి హత్యపై దర్యాప్తు చేశారు.
కాగా, గ్రామానికి చెందిన 31 ఏళ్ల యూనస్ అన్సారీ సోదరి, వికాస్ గిరి కలిసి ఉండగా తాము చూసినట్లు పోలీసులకు గ్రామస్తులు తెలిపారు. దీంతో అన్సారీని చాలాసార్లు ప్రశ్నించగా తనకేమీ తెలియదని అన్నాడు. అయితే మరికొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు ఈ నెల 4న అన్సారీని అదుపులోకి తీసుకుని క్రాస్‌ఎగ్జామ్ చేశారు. దీంతో హత్య గుట్టు విప్పాడు. తన సోదరిని గిరి వేధిస్తున్నాడని, తమ ఇంటి వద్ద రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపాడు. రాడ్‌తో కొట్టగా అతడు చనిపోయినట్లు చెప్పాడు.
అనంతరం మృతదేహాన్ని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ పాతిపెట్టినట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడైన అతడి బంధువు సిర్తాజ్ మహ్మద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. మృతుడు వికాస్ గిరి, అన్సారీ మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయని, ఈ క్రమంలో అన్సారీ సోదరితో అతడికి పరిచయం ఏర్పడిందని పోలీసులు వెల్లడించారు.