Mumbai - Wipe Out: సముద్రంలో మునిగిపోనున్న ముంబై నగరం? తాజా పరిశోధనల హెచ్చరిక, అధిక జనాభా, భారీ నిర్మాణాలతో భూమి కుంగిపోతుందని వెల్లడించిన రిపోర్ట్స్
Mumbai City | Photo Credits: Wikimedia Commons

New York, October 30:  దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) నగరానికి పెను ముప్పు పెంచి ఉందని తాజా పరిశోధనలు హెచ్చరించాయి. 2050 నాటికి ముంబై తుడిచిపెట్టుకుపోయే (Wiped out) అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని న్యూయార్క్ కు చెందిన క్లైమేట్ సెంట్రల్ (Climate Central) అనే సైన్స్ ఆర్గనైజేషన్ 'నేచర్ కమ్యూనికేషన్' (Nature Communications) పేరుతో ఒక కథనాన్ని ప్రచురించింది. వాతావరణంలో కలిగే మార్పులు, సముద్ర మట్టాలు పెరగటం కారణంగా తీరప్రాంత భూభాగాలు సముద్రంలో కలిసిపోనున్నాయి. ఒక అంచనా ప్రకారం దాదాపు 3 కోట్ల జనాభా కలిగిన ముంబై నగరానికి ఈ ముప్పు ఎక్కువగా పొంచి ఉన్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న నగర జనాభా, వారి కోసం జరిగే నిర్మాణాలతో ఇక్కడి భూమి కుంగిపోతున్నట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. ఒకప్పుడు ద్వీపాల సమాహారంగా ఉన్న ఈ చారిత్రక నగరం, ఆ ద్వీపాలను కలుపుతూ మహానగరంగా నిర్మించబడింది.

దీని ప్రకారం 2050 నాటికి ముంబై నీట మునుగుతుందని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు, వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయకపోతే ముంబై పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని రిపోర్ట్స్ పేర్కొన్నాయి. తీరప్రాంతాలపై అధ్యయనం చేసే ఈ సంస్థ, సముద్రమట్టాలు పెరుగుతుండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో నివసించే సుమారు 15 కోట్ల మందిపై దీని ప్రభావం పడనున్నట్లు ఆందోళన వ్యక్తంచేసింది. భీకర అలల తాకిడికి వియత్నాం, బ్యాంకాక్, షాంఘై, అలెగ్జాండ్రియా, బస్రా ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉన్నట్లు తాజా పరిశోధనలు తెలిపాయి. ఇండియాలో ముంబై తర్వాత, కోల్‌క‌తా నగరానికి ముప్పు పొంచి ఉన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు.

చివరగా, తీర ప్రాంతాల్లో నివసించే జనాభాను తగ్గించాలి. వీలైనంత ఎక్కువ మందిని వేరే చోట్లకు తరలించే ఏర్పాట్లు చేయాలని ఈ పరిశోధనలు సూచించాయి. జనాభా బరువును తగ్గిస్తే కొంతవరకు ఈ ముప్పుకు కొంతవరకు అడ్డుకట్ట వేయవచ్చు, జరగబోయే నష్టాన్ని తగ్గించవచ్చు అని తాజా పరిశోధనలు వెల్లడించాయి.