Mumbai Local Train Services Resume (Photo Credits: AFP)

Mumbai, January 30:  కోవిడ్ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన ముంబై లోకల్ ట్రైన్ సర్వీసులు దాదాపు 10 నెలల ఫిబ్రవరి 1 నుంచి సాధారణ ప్రయాణికుల కోసం తిరిగి ప్రారంభమవుతున్నాయి. కోవిడ్ -19 నిబంధనలను పాటిస్తూ, రద్దీ ఎక్కువగా ఉండని సమయాల్లో ముంబై సబర్బన్ రైళ్ళలో ప్రయాణించడానికి సాధారణ ప్రజలకు అనుమతించాలని మహరాష్ట్ర సర్కార్ మరియు రైల్వేశాఖ నిర్ణయించాయి.

అయితే రైళ్లలో రద్దీని నివారించడంతోపాటు, అత్యవసర సిబ్బంది సేవలను పొందగలిగేలా సమయాలను అస్థిరంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం రైల్వేశాఖను కోరింది.

ఈ నేపథ్యంలో రైళ్లలో రద్దీని నివారించడానికి ప్రయాణికులకు కొన్ని స్లాట్లు కేటాయించనున్నారు. ఆ నిర్ణీత స్లాట్ లోనే వారు ప్రయాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. చెల్లుబాటు అయ్యే టికెట్ లేదా పాస్ కలిగి ఉన్న వ్యక్తి ఉదయం 7 గంటల లోపే రైలును ఎక్కాల్సి ఉంటుంది. ఉదయం 7 దాటితే, ప్రయాణికులకు అనుమతి ఉండదు. తిరిగి మధ్యాహ్నం 12 నుంచి 4 లోపు రిటర్న్ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 4 లోపు ప్రయాణించకపోతే మళ్లీ రాత్రి 9 దాటేంత వరకు అనుమతి ఉండదు. స్టేషన్లలో ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్లు మూసివేయబడతాయి.

పీక్ అవర్‌గా భావించే ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 నుంచి 9 గంటల మధ్య సమయం అత్యవసర సేవల సిబ్బందికి, ఇప్పటికే అనుమతి ఉన్నవారికి కేటాయించాలని ప్రతిపాదనలో పేర్కొంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముంబై లోకల్ రైలు సేవలను సాధారణ ప్రజలకు తిరిగి ప్రారంభించినట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే మహారాష్ట్రలో లాక్డౌన్ ను ఫిబ్రవరి నెల వరకు పొడగిస్తున్నట్లు పేర్కొన్నారు.

ముంబైలో లోకల్ రైళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైల్వే మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. ప్రయాణికులు అన్ని కోవిడ్ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని కోరారు. "మీరు సురక్షితంగా ఉంటే, మీ సహ ప్రయాణీకులు కూడా సురక్షితంగా ఉంటారు" అని మంత్రి ట్వీట్ చేశారు.

ముంబై లోకల్ రైళ్లను నగర గుండెకాయగా అభివర్ణిస్తారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ముంబై నగరంలో రోడ్డు ప్రయాణం అంత సులభం, సౌకర్యం కాదు. ఖర్చుతో కూడిన వ్యవహారం కూడా. అయితే అందుబాటు ధరల్లో, అనుకున్న సమయంలో గమ్యస్థానాలకు చేరాలంటే  లోకల్ రైళ్లే శరణ్యం. నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలను చేర్చే ముంబై లోకల్ రైళ్లు కరోనావైరస్ మహమ్మారి కారణంగా గత ఏడాది మార్చి చివరిలో నిలిపివేయబడ్డాయి, అయితే జూన్ 2020 నుండి పరిమిత సంఖ్యలో అత్యవసర సేవల సిబ్బంది కోసం తిరిగి ప్రారంభమయ్యాయి.

గత ఏడాది మార్చిలో లాక్‌డౌన్‌కు ముందు, ముంబైలో సుమారు 80 లక్షల మంది ప్రయాణికులు లోకల్ రైలు సేవలను ఉపయోగించారు. ప్రస్తుతం 20 లక్షల మంది ప్రయాణికులు లోకల్ రైళ్లను ఉపయోగిస్తున్నారు.

కోవిడ్ కారణంగా దేశంలో అత్యంత నష్టపోయిన రాష్ట్రం మహారాష్ట్రనే అందులోనూ 90 శాతం కేసులు ముంబై నగరంలోనే ఉన్నాయి. దాదాపు 10 నెలల తర్వాత ఇప్పుడిప్పుడే కొవిడ్ నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో 95 శాతం రైళ్లను నడిపేందుకు అధికారులు నిర్ణయించారు.