Mumbai, November 17: ఏయే నగరాల్లో రహదారులు వాహనదారులు డ్రైవింగ్ చేయడానికి అనువుగా ఉన్నాయి, ఏయే నగరాల్లో రోడ్లు పరమచెత్తగా ఉన్నాయనే దానిపై ప్రపంచవ్యాప్తంగా 100 నగరాల్లో అధ్యయనం జరిగింది. ఈ సర్వే ప్రకారం భారత్ లోని ముంబై (Mumbai) 100వ ర్యాంకుతో చిట్ట చివరగా నిలిచింది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరంలోని రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, ఇక్కడ డ్రైవింగ్ అనుభవం చాలా కఠినంగా అనిపిస్తుందని ఆ సర్వే తేల్చింది. ఇక మరో భారతీయ నగరం కోలకతా (Kolkata) కూడా ముంబైకి ఏ మాత్రం తీసిపోకుండా కేవలం 2 స్థానాల దూరంలో 98వ స్థానంలో నిలిచింది.
నగరవాసుల డ్రైవింగ్ అనుభవం (Driving Experience) , మౌలిక సదుపాయాలు, భద్రత మరియు ఖర్చులు అనే ప్రధాన అంశాల ఆధారంగా, మరియు అసమాన రహదారులు, తరచుగా వచ్చే స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ రద్దీ, అడ్డదిడ్డమైన ట్రాఫిక్, వాహనదారుల్లో ట్రాఫిక్ సెన్స్, ప్రజారవాణా నాణ్యత, పీల్చే గాలి నాణ్యత స్థాయిలు, ఇంధన ధరలు మరియు వార్షిక రహదారి పన్ను వంటి 15 రకాల ఉప అంశాలను పరిగణలోకి తీసుకొని యూరోపియన్ కార్ పార్ట్స్ రిటైలర్ 'మిస్టర్ ఆటో' (Mister Auto) ప్రపంచవ్యాప్తంగా 100 నగరాలలో ఈ సర్వే చేపట్టింది.
ఇక సర్వే ఫలితాల ప్రకారం..
డ్రైవింగ్ కోసం ప్రపంచంలోని టాప్ 10 చెత్త నగరాలు
భారత్ లోని ముంబై 100వ స్థానం, మంగోలియాలోని ఉలాన్‌బాతర్ 99వ స్థానం, భారత్ లోని కోలకతా 98వ స్థానం, నైజీరియాలోని లాగోస్ 97వ స్థానం, పాకిస్తాన్‌లోని కరాచీ 96వ స్థానం, కొలంబియాలోని బొగోటా 95వ స్థానం, బ్రెజిల్‌లో సావో పాలో 94వ స్థానం, బ్రెజిల్‌లో మెక్సికో సిటీ 93వ స్థానం, బ్రెజిల్‌లో రియో డి జనీరో 92వ స్థానం, మరియు రష్యాలో మాస్కో 91వ స్థానంలో నిలిచాయి.
ఇక మరో వైపు, కెనడా యొక్క కాల్గరీ సిటీ డ్రైవింగ్ అత్యుత్తమం అని సర్వే ద్వారా తెలిసింది. ఈ నగరం తొలిస్థానంలో నిలవగా, దుబాయ్ మరియు మరో కెనడా నగరం ఒట్టావా సంయుక్తంగా 2వ స్థానంలో నిలిచాయి. అయితే ర్యాంకుల పరంగా దుబాయ్ ముందు వరుసలో వస్తుంది.
డ్రైవింగ్ కోసం ప్రపంచంలోని టాప్ 10 ఉత్తమ నగరాలు
1వ స్థానంలో కాల్గరీ (కెనడా), 2వ స్థానంలో దుబాయ్ (యుఎఇ), 3వ స్థానంలో ఒట్టావా (కెనడా), 4వ స్థానంలో బెర్న్ (స్విట్జర్లాండ్), 5వ స్థానంలో ఎల్ పాసో (యుఎస్ఎ), 6వ స్థానంలో వాంకోవర్ (కెనడా), 7వ స్థానంలో గోథెన్‌బర్గ్ (స్వీడన్), 8వ స్థానంలో డ్యూసెల్డార్ఫ్ (జర్మనీ), 9వ స్థానంలో బాసెల్ (స్విట్జర్లాండ్), 10వ స్థానంలో డార్ట్మండ్ (జర్మనీ) నగరాలు నిలిచాయి.
అయితే, ఈ జాబితాలో రెండు భారతీయ నగరాలు 100లో చిట్టచివరగా నిలవగా, అందులో మన హైదరాబాద్ (Hyderabad) లాంటి నగరం సంతోషించదగిందే అయినప్పటికీ 100 తర్వాత ఏదో ఒక ర్యాంకులో ఖచ్చితంగా ఉంటుంది. హైదరాబాద్ రోడ్లపై గుంతలు, దుమ్ము మరియు ట్రాఫిక్ రద్దీ, ట్రాఫిక్ సెన్స్ సమస్యలు డ్రైవింగ్ కి కఠినమైన అంశాలే.
తాజాగా కేంద్ర రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (Union ministry of road transport and highways), దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నగరాలు మరియు రాష్ట్రాల జాబితా- 2018 ను విడుదల చేసింది. అందులో హైదరాబాద్, తెలంగాణ 8వ స్థానంలో నిలువగా, ఆంధ్ర ప్రదేశ్ 7వ స్థానంలో నిలవడం ఆందోళన కలిగించే విషయం. 2018కి గానూ అత్యధికంగా 63,920 రోడ్డు ప్రమాదాలతో తమిళనాడు ప్రథమ స్థానంలో ఉంది.