Nagpur, AUG 07: సాంకేతికతలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ...మనసుల్లో మార్పులు రాకపోతే లాభం లేదు. టెక్నాలజీతో ప్రాణాలను కాపాడే రోజులు వచ్చినప్పటికీ...కొందరు మాత్రం మూఢనమ్మకాలతో ప్రాణాలు తీస్తున్నారు. గతంలో మారుమూల ప్రాంతాల్లోనే ఇలాంటి ఘటనలు జరిగేవి. కానీ ఇటీవల పట్టణాల్లో కూడా కొందరు చదువుకున్న మూర్ఖులు మూఢనమ్మకాలతో ప్రాణాలు తీస్తున్నారు. దెయ్యాలు, క్షుద్ర పూజలు అంటూ అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక జంట (Couple) తమ కూతురుకు దెయ్యం పట్టిందని క్షుద్ర పూజలు నిర్వహించింది. దీనిలో భాగంగా విపరీతంగా కొట్టడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ (Nagpur) పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సుభాష్ నగర్‌కు చెందిన సిద్ధార్థ్ చిమ్నీ (Siddharth Chimne) అనే వ్యక్తి ఒక లోకల్ న్యూస్ యూట్యూబ్ ఛానెల్ (Youtube channel) నిర్వహిస్తున్నాడు. గత పౌర్ణమి సందర్భంగా సిద్ధార్థ్ తన భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి ఒక దర్గాకు వెళ్లాడు. ఆ తర్వాత నుంచి అతడి చిన్న కూతురు ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో దెయ్యం పట్టిందని (black magic) నమ్మిన ఆ కుటుంబం కూతురుకు క్షుద్రపూజలు నిర్వహించాలనుకుంది.
గత శుక్రవారం రాత్రి పాప తల్లిదండ్రులు, అత్తమ్మ కలిసి పాపతో క్షుద్రపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాపను దారుణంగా కొడుతూ, రకరకాల ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలను అర్థం చేసుకోలేని, దెబ్బలకు తట్టుకోలేని చిన్నారి చాలా ఏడ్చింది. చివరకు గాయాలు భరించలేక స్పృహ కోల్పోయింది. వెంటనే దగ్గర్లోని దర్గాకు తీసుకెళ్లారు. అక్కడ ఉదయం వరకు ఉంచి, తర్వాత స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి వయసు ఐదేళ్లే. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ముగ్గురినీ అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఫోన్‌లో బాలికను హింసిస్తున్న దృశ్యాల్ని రికార్డు చేశారు.