Murshidabad, September 19: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధాలున్న ఉగ్రవాదుల గుట్టును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) శనివారం రట్టు చేసింది. దేశంలో ఉగ్ర దాడులకు కుట్రపన్నిన (NIA Busts Al-Qaeda Terror Module) ఆల్‌ఖైదా ఆపరేటర్లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్ట్ చేసింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్, కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం నగరాల్లో ఎన్ఐఏ అధికారులు శనివారం ఆకస్మిక దాడులు చేసి అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న 9 మంది ఉగ్రవాదులను అరెస్టు (Arrests 9 Terror Operatives in Raids) చేశారు. నిషేధిత అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన 9 మంది ఉగ్రవాదులు ముర్షిదాబాద్, ఎర్నాకుళం కేంద్రాలుగా (West Bengal And Kerala) పనిచేస్తున్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
కేరళ, బెంగాల్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాడికల్స్‌ను అధికారులు విచారిస్తున్నారు. దేశంలోని ముఖ్య పట్టణాల్లో భారీ విధ్వంసం సృష్టించేందుకు ఈ బృందం ప్రణాళికలు రచిస్తున్నట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. వీరి నుంచి మరింత సమచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా శుక్రవారం నాడు కశ్మీర్‌లోని గుడీకల్ ప్రాంతంలో భారీ పేలుడు సామాగ్రీని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
పుల్వామా ఉగ్రదాడి తరహాలోనే మరోసారి విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని బలగాలు భావిస్తున్నాయి. ఆ ప్రాంతంలో 125 గ్రాముల చొప్పున మొత్తం 416 ప్యాకెట్లలో పేలుడు పదార్థాలు లభించాయని ఆర్మీ వెల్లడించింది. మరిన్ని సోదాలు నిర్వహించగా మరో ట్యాంక్‌లో 50 డిటోనేటర్లు కనుగొన్నామని పేర్కొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో హోంశాఖ అధికారులు అప్రమ్తతమైయ్యారు.
అల్ ఖైదా ఉగ్రవాదుల నుంచి కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ డివైజులు, జిహాది సాహిత్యం, ఆయుధాలు, కంట్రీమేడ్ తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. అరెస్టు అయిన అల్ ఖైదా ఉగ్రవాదులు పాకిస్థాన్ దేశానికి చెందిన అల్ ఖైదా ఉగ్రవాదుల సోషల్ మీడియా ద్వారా స్ఫూర్తి పొందారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్ తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు అల్ ఖైదా ఉగ్రవాదులు కుట్ర పన్నారని తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని ఎన్ఐఏ అధికారి వెల్లడించారు. అల్ ఖైదా ఉగ్రవాదుల కార్యకలాపాలపై ఎన్ఐఏ దర్యాప్తు సాగిస్తోంది.