Harsimrat Kaur Badal (Photo Credits: IANS)

New Delhi, September 18: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సంబంధిత బిల్లులపై విపక్షాల నుంచే కాక మిత్ర పక్షాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అయింది. ఎన్డీఏ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడీ) పార్టీ నాయకురాలు హర్‌సిమ్రత్‌ కౌర్‌ ఒకడుగు ముందుకేసి ఏకంగా కేంద్రమంత్రి పదవికే రాజీనామా చేశారు. ఆ బిల్లులు రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని, వాటికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ బిల్లులకు సంబంధించి తాను, తమ పార్టీ పదేపదే అభ్యర్థించినప్పటికీ రైతుల ప్రయోజనాలను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోలేదని హర్‌సిమ్రత్‌ తన రాజీనామా లేఖలో ఆరోపించారు

ఈ బిల్లుల వల్ల రైతులు కార్పొరేట్‌ కంపెనీల గుప్పిట్లోకి వెళ్తారని, వ్యవసాయ ఉత్పత్తుల బ్లాక్‌ మార్కెటింగ్‌ పెరుగుతుందని, ఉమ్మడి జాబితాలో ఉన్న వ్యవసాయరంగం పూర్తిగా కేంద్రం ప్రభుత్వ పెత్తనం కిందికి వెళ్తుందని, రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలుండవని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అయినప్పటికీ, మోదీ సర్కార్ వెనక్కి తగ్గలేదు. ప్రతిపక్షాలు ఎంత రగడ చేసిన రెండు వ్యవసాయ బిల్లులను లోక్‌సభలో ఆమోదింపజేసుకుంది. నిన్న గురువారం ప్రతిపక్షాల ఆందోళనల నడుమే ‘ది ఫార్మర్స్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌)’ బిల్లు, ‘ది ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అష్యూరెన్స్‌ అండ్‌ ఫామ్‌ సర్వీసెస్‌' అనబడే రెండు బిల్లులను మూజువాణి ఓటుతో లోకసభ ఆమోదించింది. ఇందుకు నిరసనగా కాంగ్రెస్ మరియు డీఎంకే పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

మరోవైపు హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామాను శుక్రవారం ఉదయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు మరియు ఈ ఆమోదం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. అంతేకాకుండా కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తన ప్రస్తుత శాఖలతో పాటు అదనంగా బాదల్ నిర్వహించిన ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా స్వీకరించాలని రాష్ట్రపతి ఆదేశించారు

కాగా, అకాలీదళ్‌ పార్టీ సుదీర్ఘకాలం నుంచి బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నది. ఈ పార్టీ నుంచి హర్‌సిమ్రత్‌ ఒక్కరే ఇంతకాలం కేంద్ర మంత్రివర్గంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రిగా వ్య్వహరించారు. ఇప్పుడు ఆమె తన పదవి నుంచి వైదొలగడంతో ఇకపై ఎన్డీఏలో కొససాగడంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని అకాలీదళ్‌ చీఫ్ సుఖ్‌బీర్‌సింగ్‌ మీడియాకు తెలిపారు.