
New Delhi, January 17: 2012 నిర్భయ సామూహిక అత్యాచారం మరియు హత్య కేసులో దోషుల్లో (Nirbhaya Convicts) ఒకరైన ముఖేష్ సింగ్ (Mukhesh Singh) పెట్టుకున్న క్షమాభిక్షను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ramnath Kovind) తిరస్కరించారు. కేంద్ర హోమంత్రిత్వ శాఖ ఈ పిటిషన్ ను నిన్న రాష్ట్రపతి వద్దకు పంపింది. ఈ క్షమాభిక్ష (Mercy Plea) ను తిరస్కరించాలని కేంద్ర హోంశాఖ సిఫారసు చేసింది. అంతకుముందు దిల్లీ ప్రభుత్వం కూడా దోషి క్షమాభిక్షను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ముఖేశ్ క్షమాభిక్షను రాష్ట్రపతి ఈరోజు తిరస్కరించినట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే తీహార్ జైలుకు పంపనున్నట్లు వెల్లడించింది.
ఉరిశిక్షపై దోషులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్ట్ కొట్టివేసిన తర్వాత ఈనెల 22వ తేదీన నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని జనవరి 7న పాటియాల కోర్ట్ డెత్ వారెంట్ జారీచేసింది. అనంతరం ముకేశ్, వినయ్ శర్మ అనే ఇద్దరు దోషులు సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్లను దాఖలు చేశారు. అప్పుడు కూడా సుప్రీం ధర్మాసనం వారి అభ్యర్ధనలను తోసిపుచ్చింది మరియు మరణశిక్షను పరిశీలించాలని కోరిన దోషుల క్యురేటివ్ పిటిషన్లకు ఎటువంటి అర్హత లేదని ఏకగ్రీవంగా తేల్చింది. దీంతో న్యాయపరంగా ఉన్న చిట్టచివరి అవకాశం కూడా దోషులు వినియోగించుకున్నట్లయింది.
ఈ తరుణంలో ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి వద్ద అభ్యర్థన పెట్టుకున్నాడు. ఆపై రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పెండింగ్ లో ఉన్నందున, తన ఉరిశిక్ష అమలును ఆపాలంటూ దిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ వేశాడు. ముఖేష్ సింగ్ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి వద్ద పిటిషన్ పెట్టుకోవడంతో రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు దోషుల మరణశిక్ష అమలు సాధ్యం కాదని తీహార్ జైలు అధికారులు మరియు దిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపారు. ఒకవేళ రాష్ట్రపతి తిరస్కరించినా కూడా ఉరిశిక్ష అమలుకు నిబంధనల ప్రకారం 14 రోజుల నోటీస్ పీరియడ్ గడువు ఉంటుందని దిల్లీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయినప్పటికీ హైకోర్ట్ ముఖేశ్ పిటిషన్ ను తోసిపుచ్చింది. నిర్భయ దోషుల ఉరితీత అమలులో ట్విస్టులే ట్విస్టులు
చివరాఖరుగా రాష్ట్రపతి కూడా క్షమాభిక్షను తిరస్కరించారు. మరి ఇప్పటికైనా ఇదివరకు ప్రకటించినట్లుగా జనవరి 22న దోషుల ఉరితీత అమలు జరుగుతుందా? ఇంకా ఏమైనా ట్విస్టులు మిగిలి ఉన్నాయా అనేది దానిపై సందిగ్ధత ఇంకా వీడలేదు.