Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సోకిన కరోనావైరస్, స్వీయ నిర్భంధంలోకి వెళ్లినట్లు ప్రకటన, ఇప్పటికే పదుల సంఖ్యలో పార్లమెంట్ సభ్యులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ
File Image of Nitin Gadkari | Photo Credits: IANS

New Delhi, September 16: దేశంలో ఇప్పటికే 50 లక్షల మందికి పైగా సోకిన కరోనావైరస్, వారు వీరు అని తేడా లేకుండా అందరిపై తన ప్రతాపం చూపిస్తోంది. తాజాగా మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు నితిన్ గడ్కరీ బుధవారం సాయంత్రం ధృవీకరించారు. ఈయనకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఏడుగురు కేంద్ర మంత్రులు మరియు కనీసం 20 మంది వరకు పార్లమెంట్ సభ్యులు ఈ వైరస్ బారిన పడ్డారు.

"నిన్న నాకు బలహీనంగా అనిపించడంతో వైద్యుడిని సంప్రదించాను. నాకు చెక్ అప్ చేసిన డాక్టర్ COVID 19 పాజిటివ్ గా అని నిర్ధారించారు. ప్రస్తుతం నేను అందరి ఆశీర్వాదాలతో ఆరోగ్యంగానే ఉన్నాను, నాకు నేనుగా ఐసోలేషన్ అయ్యాను" అని గడ్కరీ ట్వీట్ చేశారు.

Nitin Gadkari's Tweet:

 

సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనాయి. అయితే ఈ సమావేశాల ప్రారంభానికి ముందే సమావేశాలకు హాజరయ్యే పార్లమెంటు సభ్యులందరికీ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో 17 మంది లోకసభ సభ్యులు సహా, 8 మంది రాజ్యసభ సభ్యులకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే గడ్కరీకి అప్పుడు నెగెటివ్ అని తేలడంతో ఆయన సోమవారం సమావేశాలకు హాజరయ్యారు.

కాగా, నిన్నటి నుంచి కాస్త బలహీనంగా అనిపించడంతో తన వ్యక్తిగత డాక్టరును సంప్రదించగా, ఆయనకు మరోసారి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో గడ్కరీకి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో తనకు తానుగా సెల్ఫ్ ఐసోలేట్ అవుతున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. తనకు సన్నిహితంగా మెలిగిన ప్రతి ఒక్కరు సేఫ్టీ ప్రోటోకాల్‌ను పాటించాలని మంత్రి కోరారు.