File Image of Nirmala Sitharaman | (Photo-ANI)

New Delhi, April 1: చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు నిన్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని కొన్ని గంటల్లోనే వెనక్కి తీసుకుంది. వడ్డీ రేట్లపై ఎలాంటి కోతలు లేవు, ఇంతకుముందు వడ్డీ రేట్లు ఎలా ఉండేవో అవే యధాతథంగా కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ గురువారం ఉదయం స్పష్టం చేశారు.

"చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు 2020-2021 చివరి త్రైమాసికంలో ఉన్న రేట్ల వద్దే కొనసాగుతాయి, అనగా మార్చి 31, 2021 నాటికి ఉన్న రేట్లు కొనసాగుతాయి. అంతకుముందు వడ్డీ రేట్లలో కోతలు విధిస్తున్నట్లు పర్యవేక్షణ విభాగం జారీ చేసిన ఉత్తర్వులు ఉపసంహరించబడతాయి" అని ఫైనాన్స్ మంత్రి నిర్మల సీతారామన్ గురువారం ఉదయం ట్వీట్ ద్వారా వెల్లడించారు.

Here's the tweet:

ఆర్థిక సంవత్సరం చివరి రోజున, 2021-22 మొదటి త్రైమాసికంలో 1.1 శాతం వరకు వడ్డీ రేట్లను తగ్గించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పిపిఎఫ్‌పై వడ్డీ రేటును 7.1 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించారు. ఎన్‌ఎస్‌సి 6.8 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గించారు.

భారత ప్రభుత్వ చిన్న మొత్తం పొదుపు పథకాలైన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు లేదా ఎన్ఎస్సి మరియు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా పిపిఎఫ్ నుండి పథకాల వడ్డీ రేట్లపై కోతలు విధిస్తున్నట్లు కేంద్రం బుధవారం సాయంత్రం చేసిన ప్రకటన విస్మయంతో పాటు, పలు వర్గాల ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వడ్డీ రేట్ల కోత ద్వారా దేశంలోని కోట్ల మంది మధ్య తరగతి డిపాజిటర్లపై తీవ్ర ప్రభావం పడుతోంది.

చాలా మంది ప్రజలు సోషల్ మీడియా వేదికగా మోదీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. సామాన్యుడిని దోచుకుంటూ కార్పోరేట్లను పెంచుతున్న నరేంద్ర మోదీ చర్యలకు ప్రజాస్వామ్య దేశం ఖచ్చితంగా గుణపాఠం నేర్పుతుందని చాలా మంది ట్వీట్లు, కామెంట్లు చేశారు.

మరోవైపు ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి తరుణంలో కేంద్రం వెంటనే అప్రమత్తమై వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.