Sensex (Photo-ANI)

Mumbai, FEB 22: దేశీయ స్టాక్‌ మార్కెట్ల ట్రేడింగ్‌ అవర్స్‌ను (trading hours) పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటలదాకా మార్కెట్‌ కార్యకలాపాలు కొనసాగేలా మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ (SEBI) చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగానే మార్కెట్‌ భాగస్వాములతో ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని మంగళవారం రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఉదయం 9:15 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు అటు బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (BSE), ఇటు నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (NSE)లలో ట్రేడింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే దీన్నిప్పుడు మరో గంటన్నరపాటు పెంచాలని సెబీ యోచిస్తున్నది. నిజానికి 2018లోనే ఈ ట్రేడింగ్‌ సమయం పొడిగింపు కోసం సెబీ ఓ ఫ్రేమ్‌వర్క్‌ను జారీ చేసింది. అయినప్పటికీ దీనిపై ఓ నిర్ణయం మాత్రం ఆలస్యం అవుతూనే ఉన్నది. ట్రేడింగ్‌లో అంతరాయం ఏర్పడితే వాటాదారులకు 15 నిమిషాల్లోగా తెలియపర్చాలని గత నెల స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సెబీ సూచించిన సంగతి విదితమే. ఇలాంటప్పుడు ట్రేడింగ్‌ సమయాన్ని గంటన్నరపాటు పెంచాలని కూడా ఎక్సేంజ్‌లకు స్పష్టం చేసింది. ఇందుకోసం ఓ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (SOP)నూ తెచ్చింది.

Stock Market Highlights: రూపాయి ఢమాల్, వరుసగా ఐదో రోజలు లాభాలకు బ్రేక్, నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు 

‘ట్రేడింగ్‌ అవర్స్‌ను పెంచడం వల్ల దీర్ఘ కాలంలో క్రియాశీల రిటైల్‌ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (F&O) ట్రేడర్ల మానసిక ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం పడుతుందో నేనైతే చెప్పలేను’ అని జెరోధా సీఈవో నితిన్‌ కామత్‌ అన్నారు. చాలాసేపు లాభనష్టాలను గమనిస్తూ ఉండటం కూడా ఒత్తిడికి దారితీస్తుందని, ఫలితంగా వారి వ్యక్తిగత జీవితంపై దుష్ప్రభావం ఉండవచ్చని చెప్పారు. అయితే ఈ నిర్ణయంతో స్వల్ప కాలంలో క్యాపిటల్‌ మార్కెట్ల వ్యాపార ఆదాయం పెరగవచ్చని, అయినప్పటికీ రిటైల్‌ ఇన్వెస్టర్లకు దీనివల్ల లాభాలే దక్కుతాయన్నది కూడా చెప్పలేమన్నారు. చివరకు మార్కెట్లలోకి కొత్తగా వచ్చేవారు తగ్గిపోయే ప్రమాదం ఉందని, దీర్ఘ కాలంలో ద్రవ్యలభ్యతనూ దెబ్బ తీయవచ్చని హెచ్చరించారు. ఇదే జరిగితే ప్రతి ఒక్కరికీ నష్టమేనని ట్వీట్‌ చేశారు. ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌ అవర్స్‌ను రోజూ రాత్రి 11:55 గంటలదాకా ఎన్‌ఎస్‌ఈ పొడిగించే వీలుందన్న వదంతులపైనా కామత్‌ స్పందిస్తూ ఇది ట్రేడర్ల వ్యక్తిగత జీవితాలతో ఆటలాడుకోవడమేనని అభివర్ణించారు.