Balasore Triple Train Crash: తప్పుడు సిగ్నలింగ్ వల్లే ఇటీవల ఒడిశాలోని బాలాసోర్ ఘోర రైలు ప్రమాదం (Balasore Train Accident Cause) జరిగిందని రైల్వే భద్రత కమిషన్ రైల్వే బోర్డుకు సోమవారం నివేదించింది. రెండు ట్రాక్‌ల స్విచ్‌ల పనితీరులో లోపాలు కనిపించి ఉంటే సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ విభా గాలు నష్ట నివారణ చర్యలు తీసుకొని ఉండాల్సిందని కమిషన్ అభిప్రాయపడింది. లెవల్ క్రాసింగ్ గేట్ 94 వద్ద అనుమతి పొందిన సర్క్యూట్ డయాగ్రామ్‌ను ఎలక్ట్రికల్ లిఫ్టింగ్ బారియర్ స్థానంలో సరఫరా చేయకపోవడం తప్పుడు వైరింగ్‌కు దారి తీసిందని తెలిపింది.
దాదాపు 300 మందిని బలిగొన్న ఒడిశా బాలాసోర్ రైల్వే దుర్ఘటనపై (Balasore Triple Train Crash) రైల్వే సేఫ్టీ కమిషన్ ఈ స్వతంత్ర నివేదిక సమర్పించింది. రాంగ్ సిగ్నలింగ్ వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే బోర్డుకు సమర్పించిన తన నివేదికలో పేర్కొంది. ప్రమాదానికి రాంగ్ సిగ్నలింగ్ ప్రధాన కారణమని వెల్లడించిన సీఆర్‌ఎస్ నివేదిక.. అనేక స్థాయిలో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు రైల్వే బోర్డుకు నివేదించింది. అలాగే.. భద్రతా ప్రమాణాలు పాటించి ఉంటే దుర్ఘటన జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాన్ని నివేదికలు వ్యక్తం చేసింది.
గతేడాది సైతం ఇదే తరహా దుర్ఘటన జరిగిందని.. 2022 మే 16న సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోని ఖార్గ్‌పూర్ డివిజన్ బ్యాంక్‌రనాయబాజ్ స్టేషన్ వద్ద తప్పు వైరింగ్, కేబుల్ లోపం కారణంగా జరిగిన ఘటనను నివేదికలో ప్రస్తావించింది కమిషన్. అలాగే.. లోపం సరిచేస్తే ఈ ప్రమాదం జరిగేది కాదని నివేదికలో వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని రైల్వే బోర్డుకు సూచించింది కమిషన్.
జూన్ 2వ తేదీ రాత్రి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరగ్గా.. 292 మంది మృతి చెందగా, వెయ్యి మందికిపైగా గాయపడ్డారు.ఆగిఉన్న గూడ్సురైలును బహానగాబజార్ రైల్వేస్టేషన్ వద్ద కోరమండల్ ఢీకొని పట్టాలు తప్పడం, ఆ పెట్టెలు ఎగిరిపడి, పక్కనున్న మార్గంలో వస్తున్న యశ్వంతపుర్ రైలులో చివరి పెట్టెలను ఢీకొట్టడం తెలిసిందే. యావద్దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనపై సీఆర్‌ఎస్‌తో పాటు సీబీఐ విచారణ చేపట్టింది.