Ayodhya, JAN 10: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ (Ram Lalla Consecration) జరిగి ఏడాది పూర్తవుతుండటంతో ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రతిష్ఠా ద్వాదశి ప్రారంభం సందర్భంగా స్వామివారిని వేడుకల్లో భాగంగా తొలిరోజయిన శనివారం ‘పీతాంబరి’ (Pithambari) (పసిడి వర్ణం, వెండి పోగులతో తయారు చేసిన వస్త్రాలు)తో అలంకరిస్తారు. ఢిల్లీలో బంగారు, వెండి పోగులతో నేయించి వీటిని ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ దుస్తులు ఇవాళ అయోధ్యలోని (Ayodhya) రామాలయానికి చేరుకున్నాయి. జిల్లా యంత్రాంగం, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కలిసి ఈ వేడుకను నిర్వహిస్తాయి. గత ఏడాది జనవరి 22న మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీరాముడి ప్రతిష్ఠాపన మహోత్సవం జరిగిన విషయం తెలిసిందే.
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది జనవరి 11న వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు అభిషేక పూజ జరిగిన తర్వాత మధ్యాహ్నం 12.20 గంటలకు రాముడికి మహాహారతి ఇస్తారు. ఈ ప్రథమ వార్షికోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి మూడు రోజులు నిర్వహించే ఈ వేడుకల్లో సామాన్యులకు పెద్దపీట వేయనున్నారు.
నిరుడు విగ్రహ ప్రాణప్రతిష్ఠకు కొన్ని కారణాల వల్ల హాజరుకాలేకపోయిన ప్రజలు వార్షికోత్సవానికి హాజరుకావాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పలుకుతోంది. ఈ కార్యక్రమానికి 110 మంది వీఐపీలను కూడా ఆహ్వానించింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్షికోత్సవ కార్యక్రమాలను ప్రారంభించి, రాముడి అభిషేకం నిర్వహిస్తారు.
అంగద్ టీలా వద్ద 5,000 మంది కూర్చోవడానికి అతి పెద్ద జర్మన్ హ్యాంగర్ టెంట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో శాస్త్రీయ, సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు, రోజువారీ రామ కథా కార్యక్రమాలు, యజ్ఞశాల వంటివి కూడా ఉంటాయి. షెడ్యూల్‌లో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు రామ కథ, ఆ తర్వాత రామచరితమానస్‌పై ప్రసంగాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. ప్రసాద వితరణ రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఉంటుంది.