Onion Price Rise ( Photo-pexels )

New Delhi, September 22: ఉల్లి ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. కోయకుండానే సామాన్యులకు కన్నీళ్లను తెప్పిస్తోంది. ఉల్లి ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో నగరవాసి వామ్మో.. ఉల్లి అని ఉలికిపడుతున్నాడు. రెండు వారాల నుంచి ఉల్లిగడ్డల ధరలు భగ్గుమంటున్నాయి. బహిరంగ మార్కెట్‌లో మంచి రకం ఉల్లిపాయలు కిలో కనీసం 50 నుంచి 60కి వరకు అమ్ముతున్నారు. వర్షాల కారణంగా మార్కెట్‌కు ఉల్లిపాయలు రావడం తగ్గడంతో రేటు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. క్వింటాల్ ఉల్లిపాయలు రూ.3000 నుంచి రూ.5000 వరకు పలుకుతున్నాయి. రాబోయే రోజుల్లో ఉల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు హైదరాబాద్‌లో ఇళ్ల ముందుకొచ్చి మరీ రూ.50కి నాలుగు కిలోల చొప్పున ఉల్లిపాయలను విక్రయించారు. దాదాపు 45 రోజుల్లోనే ఉల్లి ధర భారీగా పెరగడం సామాన్యుడిని బెంబేలెత్తిస్తోంది.

కాగా హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఉల్లిగడ్డ సరఫరా అవుతుంది. ఈ క్రమంలోనే ఉల్లి రేట్లు భారీగా పెరిగిపోయాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉల్లిపాయలు పాడైపోగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం జరిగడంతో ఉల్లి దిగుమతులు తగ్గగా.. రేట్లకు రెక్కలు వచ్చేశాయి. సాధారణ రోజుల్లో మార్కెట్‌కు రోజుకు 75 నుంచి 150లారీల ఉల్లిగడ్డ దిగుమతి జరుగుతుండగా ప్రస్తుతం నగరానికి 30 నుంచి 40లారీల మేరకే వస్తున్నాయి. దీంతో ధరలు పెరిగిపోయాయి.

ఉల్లి పంట ఎక్కువగా ఉండే కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి సరఫరా కావాల్సిన ఉల్లి కావాల్సినంత మేర రాకపోవటంతో ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరోవైపు ఉల్లి రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్ల నష్టాల నుంచి గట్టెక్కామని , ఇప్పుడు పెరిగిన ధరలతో ఆనందంగా ఉందంటూ.. రైతులు చెబుతున్నారు. నిత్యం వాడే గృహిణులు ఎలాగోలా వాటి వినియోగంలో ఎవ్వరికి వారే రేషన్ విధించుకున్నాగాని తోపుడు బండ్లు, బజ్జీల వ్యాపారులు, అల్పాహారశాల వినియోగదారులు, హోటళ్ల నిర్వాహకులు మాత్రం గిలగిల్లాడుతున్నారు. ఇంకా చిరు వ్యాపారులు అంటే సమోసాలు తయారు చేసుకుని జీవనం సాగించే వారు ప్రత్యామ్నాయంగా క్యాబేజీ వైపు మొగ్గుచూపుతున్నారు.ఉల్లి వాడకం వంటల్లో తప్పనిసరిగా ఉండటంతో ధర ఎక్కువైనా కూడా కొనడం తప్పడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. గతంలో ఉల్లి ధరలు పెరుగుదలతో ప్రభుత్వం కూలిన సంఘటనలు ఉన్నాయి. ఈ సారి ఏ ప్రభుత్వం కూలుతుందనే విషయం సోషల్ మీడియాలో ఆసక్తికర అంశంగా మారింది.