Operation Dolphin's Nose: భారత సెయిలర్లకు అమ్మాయిలను ఎరగా వేస్తున్న పాకిస్తాన్, ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్, ఆపరేషన్ డాల్ఫిన్స్‌ నోస్‌ పేరుతో నిఘా పెట్టిన ఇంటిలిజెన్స్ డిపార్ట్‌మెంట్, పోలీసుల అదుపులో 7మంది సెయిలర్స్
Indian Navy personnel on board a naval ship File photo-Wikimedia commons)

Amaravathi, December 21: దాయాది దేశం పాకిస్తాన్ (Pakistan) మన దేశ నావికా దళ రహస్యాలను తెలుసుకునేందుకు కుట్ర పన్నింది. అమ్మాయిలను ఎరగా వేసి నావికా దళ సిబ్బందిని (Indian Navy sailors) ముగ్గులోకి దింపుతోంది. మన నావికా దళ సిబ్బందితో సోషల్ మీడియా (Social Media) ద్వారా పరిచయం పెంచుకున్న ఈ అమ్మాయిలు వారితో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకోవడం, ఆ తర్వాత సెక్స్ చేస్తున్న సమయంలో రహస్యంగా వీడియోని తీసి వారిని బ్లాక్ మెయిల్ చేయడం వంటి పనులకు పాల్పడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలో (VISAKHAPATNAM) పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో ఏడుగురు నౌకాదళ సిబ్బందిని శుక్రవారం విశాఖ పోలీసులు అరెస్టు చేశారు.

గూఢచర్యం వ్యవహారం కేసులో వీరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నావికాదళ ఇంటెలిజెన్స్‌, కేంద్ర నిఘావర్గాలు ‘ఆపరేషన్ డాల్ఫిన్స్‌ నోస్‌’ పేరిట సంయుక్తంగా నిర్వహించి ఈ ముఠాను పట్టుకున్నాయి. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నేవీ సిబ్బందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

మరో హవాలా ఆపరేటర్‌‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన కేసు నమోదు చేశామని.. గూఢచర్యం వ్యవహారంలో మరికొందరు అనుమానితులను సైతం ప్రశ్నిస్తున్నట్లు శుక్రవారం రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ AP DGP Goutham Sawang) వెల్లడించారు. అయితే ఇంతకు మించి మరిన్ని విషయాలు చెప్పేందుకు నిరాకరించారు.

అలాగే నిందితులతో ఇంకెవరికైనా ప్రభుత్వ అధికారులతో సంబంధాలు ఉన్నాయా? దేశ భద్రతకు సంబంధించిన ఎలాంటి విషయాలు లీక్ చేశారనే విషయాలను చేధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి. కాగా, నిందితులను విజయవాడ ఎన్‌ఐఏ కోర్టుకు తరలించారు. వీరికి జనవరి 3 వరకు రిమాండ్‌ విధించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

2017లో భారత నావికులను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుంది. ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకుని కొందరు యువతులతో హనీ ట్రాప్‌ (వలపు వల) వేసింది. ఈ యువతులు ఫేస్‌బుక్‌ ద్వారా నావికులతో పరిచయం పెంచుకున్నారు. తర్వాత వారితో శారీరక సంబంధం వరకు వెళ్లారు.

నావికులతో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో పాక్‌ ఏజెంట్లు ఆ దృశ్యాలను రహస్యంగా వీడియోలు చిత్రీకరించారు. వాటిని చూపించి పాక్‌ గూఢచర్య విభాగం భారత నావికుల్ని బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలు పెట్టింది. భారత నౌకాదళ సమాచారం తమకు చేరవేయాలని, ఇందుకు ప్రతిఫలంగా హవాలా ద్వారా సొమ్ము కూడా ఇస్తామని ఆశ చూపడంతో నేవీ సెయిలర్స్‌ వారికి లొంగిపోయారు.

ఈ సెయిలర్స్‌ 2018 అక్టోబర్‌ నుంచి పాకిస్తాన్‌కు సమాచారం అందించడం ప్రారంభించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్ల సమాచారాన్ని శత్రు దేశానికి చేరవేసినట్లు సమాచారం. సమాచారం ఇచ్చిన ప్రతి నెలా వారికి పాక్‌ ఏజెంట్లు హవాలా రూపంలో డబ్బులు అందజేసేవారు. ఇందుకోసం ఒక హవాలా ఆపరేటర్‌ను సైతం నియమించారు. ఒకరికి తెలియకుండా మరొకరి ద్వారా ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు.

ఈ నేపథ్యంలోనే భారత నౌకాదళంలో కొందరు దేశద్రోహులున్నారని అధికారిక వర్గాలకు రహస్య సమాచారం అందింది. నౌకాదళ నిఘా వర్గాలు 4 నెలల క్రితం ఓ సెయిలర్‌ ఫోన్‌ మాట్లాడుతుండగా.. రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నట్లు గుర్తించాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాయి.

మిగిలిన వారిపైనా నిఘా పెంచగా.. ఏడుగురు నావికులు వేర్వేరు మహిళలతో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. వారి ఫేస్‌బుక్‌ సంభాషణల్నీ గమనించారు. దీంతో ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ), ఏపీ ఇంటెలిజెన్స్, సెంట్రల్‌ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్‌ సంయుక్తంగా ‘ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌’ మొదలు పెట్టాయి. హవాలా ద్వారా డబ్బులు తీసుకుంటున్న సమయంలో నావికుల్ని వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు.