
Bengaluru, Feb 15: ద్విచక్ర వాహనం, టీవీ, ఫ్రిజ్ లేదా ఐదు ఎకరాలకు పైగా భూమిని కలిగి ఉన్న వారికి రేషన్ కట్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీపీఎల్ కార్డుల (BPL Cards in Karnataka) మంజూరు విషయంలో ఇకపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించదని ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖమంత్రి ఉమేష్ కత్తి స్పష్టం చేశారు. సోమవారం బెళగావిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
రేషన్ కార్డుల పంపిణిపై ఇకపై కఠినంగా ఉండాలని సొంతగా టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం ఉంటే (Own a TV or fridge or 2 wheeler) రేషన్ కార్డును నిరాకరించాలని ఆయన తెలిపారు. ఉన్నత వర్గాలకు చెందిన వారు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్ సరుకులను ఉపయోగించుకున్నారని, దీని ద్వారా వెనుకబడిన వారికి సరుకులు చేరడంలేదని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునే ఉద్ధేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ సరఫరా చేస్తోందని, ఇకపై సరైన అర్హుల జాబితాను రూపొందిస్తామని స్పష్టం చేశారు.
ఇవి ఉంటే మార్చి 31 లోపు కార్డులను అప్పగించాలని లేదా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాలని (Surrender BPL cards or face action) కర్ణాటక ప్రభుత్వం సోమవారం పేదరిక రేఖ (బిపిఎల్) రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రజలను కోరింది. 1.20 లక్షల వార్షిక ఆదాయం కంటే వక్కువ ఉన్నవారు ఉచిత రేషన్‌కు అనర్హులన్నారు. అలాగే టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం ఉంటే రేషన్ కార్డును వెంటనే వదులుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీవీ, ఫ్రిజ్ అనేవి నేడు నిత్యవసర వస్తుల జాబితాలో చేరిపోయాయని, వాటి కారణం చేత కార్డులను తొలగించడం సరైనది కాదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బెంగళూరులోని వివిధ రేషన్ షాపుల ముందు నిరసనలు చేపట్టారు. పార్టీ కార్యకర్తలు ధార్వాడ్, మైసూరు, తుమకూరులలో కూడా నిరసన వ్యక్తం చేశారని కాంగ్రెస్ నాయకుడు తెలిపారు. సిద్దరామయ్య ప్రభుత్వంలో ఆహార, పౌర సరఫరాల మంత్రిగా ఉన్నప్పుడు ఈ విషయం తన ముందు వచ్చిందని, చాలా మంది పేద ప్రజలు ప్రభావితమవుతున్నందున నిబంధనలను సడలించకూడదని తాను నిర్ణయించుకున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే యు టి ఖాదర్ అన్నారు.
ఈ వస్తువులన్నింటినీ కొనుగోలు చేయడానికి వడ్డీ లేని రుణాలు వంటి ఆఫర్లు ఉన్నప్పుడు, ప్రజలు దానిని కొనుగోలు చేస్తారని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ప్రభుత్వం 'పేదల వ్యతిరేక' ప్రభుత్వం అని ఆయన ఆరోపించారు. బిపిఎల్ కార్డులను 'లాక్కోవడానికి' బదులు ఎక్కువ మంది లబ్ధిదారులను గుర్తించడంపై ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన కోరారు.