New Delhi, October 22: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) నమోదు చేసిన INX మీడియా కేసు (INX Media Case)లో అరెస్ట్ అయి తీహార్ సెంటర్ల్ జైలులో విచారణను ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరానికి (Chidambaram) పెద్ద ఊరట కలిగిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ, అక్టోబర్ 24 వరకు ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీలో ఉండనున్నారు. గత వారమే, ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఆయన ఈడీ కస్టడీని అక్టోబర్ 24 వరకు పొడగిస్తూ ఉత్తర్వులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. INX మీడియా కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం మరియు అతని కుమారుడు కార్తీలను అక్టోబర్ 16న ఈడీ తమ కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టింది.
INX మీడియా కుంభకోణంలో సిబిఐ మరియు ఈడీ దర్యాప్తు సంస్థలు రెండూ వేర్వేరుగా రెండు కేసులను విచారిస్తున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించి చిదంబరంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేస్తుండగా, మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడి దర్యాప్తు చేస్తోంది. చిదంబరం అరెస్ట్, ఆ తరువాత జరిగిన పరిణామాలు
ఈ కేసుకు సంబంధించి సిబిఐ 2017 మే 15న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత పీటర్ ముఖర్జీయా ప్రమోట్ చేసిన మీడియా సంస్థలోకి నిబంధనలకు విరుద్ధంగా రూ .305 కోట్ల విదేశీ పెట్టుబడులకు అనుమతించారన్న ఆరోపణలపై ఈడీ కూడా 2017లో చిదంబరంపై కేసు నమోదు చేసింది. వరుస పరిణామాల నేపథ్యంలో ఆయనను ఈ ఏడాది ఆగస్టు 21న సిబిఐ అరెస్టు చేసింది. అంతేకాకుండా ఈ కేసు వ్యవహారంలో అప్రూవర్‌గా మారిన ఇంద్రాణి ముఖర్జీయాని భయపెట్టి "ఆధారాలు నాశనం" చేశారనే ఆరోపణలను కూడా చిదంబరం ఎదుర్కొంటున్నారు.