Rahul Gandhi vs Dharmendra Pradhan (Photo-ANI)

New Delhi, July 22: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు (Parliament Budget Sessions) ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. కేంద్రంలో ఎన్డీయే సర్కార్‌ మూడోసారి కొలువుదీరిన తర్వాత తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్‌ నుంచి శతృఘ్న సిన్హా ఎంపీగా విజయం సాధించారు. ఆయన జూన్‌లో జరిగిన పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఇప్పుడు సభ ప్రారంభం కాగానే ఆయన ప్రమాణం చేశారు.

ఈ సమావేశాల్లో కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది.మంగళవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమర్పించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం తన విధి విధానాలను ముందస్తుగా తెలిపేందుకు ఆర్థిక సర్వే (Economic Survey)ను నేడు పార్లమెంట్‌కు సమర్పించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ఆర్థిక సర్వేను 12 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై నిర్మలమ్మ సభలో ప్రసంగించారు. వీడియో ఇదిగో, సైకిల్ మీద పార్లమెంటుకు వచ్చిన టీడీపీ ఎంపీ అప్పల నాయుడు, రైతు అయిన సామాన్యుడు పార్లమెంటులో అడుగుపెట్టడం గర్వంగా ఉందని వెల్లడి

ఆర్థిక సర్వే అంటే.. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే. ఏటా దీని ఆధారంగానే కేంద్ర బడ్జెట్‌ రూపకల్పన ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వశాఖ రూపొందించే ఈ సర్వే రానున్న రోజుల్లో దేశం ముందున్న సవాళ్లు, వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను ముందుగానే అంచనా వేసి పలు సూచనలను చేస్తుంది.

ప్రధాన రంగాలైన వ్యవసాయం, పారిశ్రామికోత్పత్తి, మౌలిక సదుపాయాలు, ఎగుమతి దిగుమతులు, విదేశీ మారక నిల్వలు, నగదు చలామణి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల వంటి అంశాలను కూడా ఈ సర్వే వివరిస్తుంది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటివల్ల కలుగుతున్న ఫలితాలను కూడా విశ్లేషిస్తుంది. బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. 1950-51 నుంచి యూనియన్ బడ్జెట్ తోపాటు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశ పెట్టే వారు. అయితే, 1960వ దశకం నుంచి కేంద్ర బడ్జెట్ సమర్పించడానికి ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశ పెడుతున్నారు. మధుసూదన్ రావ్ గుర్తు పెట్టుకో, జగన్ మాస్ వార్నింగ్ వీడియో ఇదిగో, అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదంటూ వైసీపీ అధినేత ఉగ్రరూపం

దేశవ్యాప్తంగా దుమారం సృష్టిస్తోన్న నీట్‌ పేపర్ లీక్ అంశం పార్లమెంటులో చర్చకు వచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నీట్ అంశంపై మాట్లాడుతుంటే.. విపక్షాలు నిరసన వ్యక్తంచేశాయి. ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. మరోవైపు.. ఈ అంశంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు చేశారు. భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పేపర్‌ లీక్‌లపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనను తప్ప అందరినీ నిందిస్తున్నారన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ.. ‘‘గత ఏడేళ్ల కాలంలో పేపర్‌ లీక్‌ జరిగిన దాఖలాలు లేవు. ఎన్టీఏ ఇప్పటివరకు 240 పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం నీట్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది’’ అని వెల్లడించారు. ఈ ప్రభుత్వం పేపర్‌లీక్‌ల విషయంలో రికార్డు సృష్టిస్తుందని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రధాన్‌ విద్యాశాఖ మంత్రిగా ఉన్నంతకాలం విద్యార్థులకు న్యాయం దక్కదన్నారు.

నీట్ – యూజీ పరీక్షలో జరిగిన అవకతవకలపై లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతూ.. భారత పరీక్ష విధానం ఓ మోసమని ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌పై విరుచుకుపడ్డారు. అదేవిధంగా నీట్‌ అంశంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఎంపీ అఖిలేష్‌ యాదవ్‌ (Akhilesh Yadav) మాట్లాడుతూ.. నీట్‌ యూజీ ప్రశ్న పత్రం లీకేజీపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. పేపర్‌ లీకేజీల్లో ఈ ప్రభుత్వం (paper leaks) రికార్డు సృష్టిస్తోందని విమర్శించారు. ‘పేపర్‌ లీక్‌ల విషయంలో ఈ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది. కొన్ని సెంటర్లలో 2 వేల మందికిపైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ మంత్రి (ధర్మేంద్ర ప్రదాన్‌ను ఉద్దేశిస్తూ) ఉన్నంత వరకూ విద్యార్థులకు న్యాయం జరగదు’ అని వ్యాఖ్యానించారు.

ఇదిలాఉంటే.. కావడి (కన్వర్‌) యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై చర్చ జరపాలంటూ రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చిన నోటీసులను ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ తిరస్కరించారు.

నేడు పార్లమెంట్‌ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ మాట్లాడారు. రాజకీయాలు చేయడానికి పార్లమెంట్‌ వేదిక కాదని.. దేశం కోసం ఉందని ప్రధాని మోదీ (PM Modi) ప్రతిపక్షాలకు హితవు పలికారు. ‘‘మనం 2029 ఎన్నికల్లో మరోసారి తలపడదాం. అప్పటివరకు పార్లమెంట్‌ను మహిళలు, రైతులు, యువత జీవితాలను బాగు చేసేందుకు వాడదాం’’ అని పేర్కొన్నారు. సభలో నిరంతరం గందరగోళం వల్ల కొందరు సభ్యులు తమ పాయింట్లను చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. ప్రజలు తీర్పు ఇచ్చేశారని చెప్పిన మోదీ.. ఇక ఆ రాజకీయాల నుంచి పార్టీలు బయటకువచ్చి దేశం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.

ఈసారి ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌ అత్యంత కీలకమైందని ప్రధాని మోదీ అభివర్ణించారు. వచ్చే ఐదేళ్లకు తమకు కార్యనిర్దేశం చేసేదిగా ఈ బడ్జెట్‌ ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు.. వికసిత్‌ భారత్‌కు ఇది పునాది వేస్తుందని చెప్పారు. దాదాపు 60 ఏళ్ల తర్వాత మూడోసారి ఒకే ప్రభుత్వం అధికారం చేపట్టిందన్నారు.

ఇక ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఆరు బిల్లులను సభామోదం కోసం తీసుకురానుంది. మరోవైపు నీట్‌ ప్రశ్నపత్నం లీకేజీ, రైల్వే భద్రత, కావడి యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలనే నిబంధన వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని విపక్ష ఇండియా కూటమి సభ్యులు సిద్ధమయ్యారు.బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయా రాష్ర్టాలకు చెందిన పార్టీలు డిమాండ్‌ చేశాయి. బీహార్‌కు చెందిన అధికార జేడీయూ, ప్రతిపక్ష ఆర్జేడీ, ఏపీకి చెందిన విపక్ష వైఎస్‌ఆర్‌సీపీ, ఒడిశాకి చెందిన ప్రతిపక్ష బీజూ జనతాదళ్‌(బీజేడీ) ఈ డిమాండ్‌ను అఖిలపక్ష సమావేశం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముందుంచాయి.