New Delhi, January 15: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 29 నుంచి ప్రారంభం కానున్నాయి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు.
బడ్జెట్ సెషన్ రెండు విడతలుగా జరుగనుంది - జనవరి 29 నుండి ఫిబ్రవరి 15 వరకు తొలి సెషన్ మరియు మార్చి 8 నుండి ఏప్రిల్ 8 వరకు రెండో విడత జరగనుంది.
17వ లోక్‌సభ 5వ సెషన్‌లో మొత్తం 35 సిట్టింగ్‌లు ఉంటాయి - మొదటి భాగంలో 11, రెండవ భాగంలో 24 సిట్టింగ్‌లు ఉండనున్నాయి.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలైన రాజ్యసభ, లోక్ సభలను ఉద్దేశించి జనవరి 29 ఉదయం 11 గంటలకు ప్రారంభ ప్రసంగోపన్యాసం చేయనున్నారు.
ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
వివిధ స్టాండింగ్ కమిటీలు మంత్రిత్వ శాఖలు / విభాగాల నిధుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవడానికి మరియు వారి నివేదికలను సిద్ధం చేయడానికి పార్లమెంట్ ఫిబ్రవరి 15న వాయిదా పడనుంది, తిరిగి మార్చి 8న ఉభయ సభలు పున: ప్రారంభమవుతాయి. ఈ మేరకు లోకసభ సచివాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
కాగా, గడిచిన ఏడాది మొత్తం లాక్డౌన్ ల కారణంగా ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. దీని ప్రభావం రాబోయే బడ్జెట్ పై ఖచ్చితంగా ఉంటుందని అర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు.