Parliament Special Session 2023: ఉభయ సభలు వాయిదా, రేపటి నుంచి కొత్త భవనంలో పార్లమెంట్ సమావేశాలు, నూతన పార్లమెంటులో ఆరు ద్వారాలతో పాటు పలు ప్రత్యేకతలు ఇవిగో..
Parliament Monsoon Session 2023 (Photo Credit: ANI)

New Delhi, Sep 18: పార్లమెంట్‌ పాత భవనం శకం ఈ రోజు సమావేశాలతో ముగిసింది. రేపటి నుంచి కొత్త భవనంలోనే పార్లమెంట్‌ సమావేశాలు నడుస్తాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. సోమవారం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల తొలి రోజు సమావేశాలు జరిగాయి.

ఇక సాయంత్రం సభని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్‌ ఓం బిర్లా.. రేపటి నుంచి కొత్త పార్లమెంట్‌ భవనంలో సమావేశాలు నడుస్తాయని తెలిపారు. కొత్త పార్లమెంట్‌ భవనంలో ఉదయం గణపతి పూజ జరుగుతుందని సమాచారం. ఆపై మధ్యాహ్నాం 1.15 నిమిషాలకు లోక్‌సభ ప్రారంభం కానుంది. మరోవైపు రాజ్యభస 2.15 నిమిషాలకు ప్రారంభం అవుతుంది.రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన నాటి నుంచి పార్లమెంటరీ ప్రయాణం నేటితో 75 ఏళ్లు పూర్తి చేసుకుంది.

కొత్త భవనం చాలా ప్రత్యేకతలను కలిగి ఉంది. అక్కడ ఎంపీల మైక్‌లన్నీ ‘ఆటోమేటెడ్‌ వ్యవస్థ’ సాయంతో పని చేస్తాయని సమాచారం. అంటే ఎవరైనా ఎంపీ మాట్లాడేందుకు స్పీకర్‌ సమయం కేటాయిస్తే.. ఆ నిర్దేశిత సమయం పూర్తి కాగానే మైక్రోఫోన్ స్విచ్‌ ఆఫ్‌ అవుతుంది. కొత్త పార్లమెంటులో బయోమెట్రిక్‌ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ఉద్వేగభరిత ప్రసంగం, ఏపీ విభజన నుంచి చంద్రయాన్ 3 మిషన్ దాకా...

ఇకపై ఎంపీలు ఎవరైనా వెల్‌లోకి దూసుకొచ్చి నిరసనలు తెలపడానికి వీలు లేకుండా ఆ ప్రాంతాన్ని బాగా కుదించినట్లు తెలుస్తోంది. నూతన పార్లమెంటులో ‘కాగిత రహిత’ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. అందుకోసం ప్రతి ఎంపీకి ఓ ట్యాబ్‌ను అందజేస్తారు. సభ నిర్వహణ విషయాలు మొత్తం అందులో నుంచే తెలుసుకోవచ్చు. జర్నలిస్టులకు సైతం కఠిన ప్రవేశ నిబంధనలు అమలు చేయనున్నారు.

వీడియో ఇదిగో, తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు, రెండు రాష్ట్రాల ఏర్పాటు వల్ల సంబరాలే లేవని వెల్లడి

కాగా కొత్త పార్లమెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చే గుమ్మాలు చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. పార్లమెంట్ భవనంలో ఆరు దర్వాజలకు ఆరు పౌరాణిక ప్రాణుల పేర్లను పెట్టారు. ఈ ఆరు ప్రాణులు 140 కోట్ల భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ ప్రత్యేకతలను సూచిస్తున్నాయి.నూతన పార్లమెంట్‌లో ఆరు ద్వారాలు ఉన్నాయి. అవి.. గజ ద్వారం, అశ్వ ద్వారం, గరుడ ద్వారం, మకర ద్వారం, శార్దూల ద్వారం, హంస ద్వారం. ప్రతి ద్వారం దాని పేరుపై ఉన్న ప్రాణి శిల్పాన్ని కలిగి ఉంది.

గజ ద్వారం..

బుద్ధి, జ్ఞాపకశక్తి, సంపద, జ్ఞానాన్ని సూచించేది ఏనుగు. దీని పేరు మీదుగా గజ ద్వారంగా ఓ గుమ్మానికి పేరు పెట్టారు. ఈ ద్వారం భవనానికి ఉత్తరం వైపు ఉంది. ఉత్తరం, వాస్తు శాస్త్రం ప్రకారం, బుధగ్రహంతో సంబంధం కలిగి ఉంది. ఇది తెలివికి మూలం అని విశ్వసిస్తారు.

అశ్వ ద్వారం..

రెండవది అశ్వ ద్వారం. గుర్రం పేరు మీదుగా గుమ్మానికి ఈ పేరు పెట్టారు. గుర్రం శక్తి, బలం, ధైర్యాన్ని సూచిస్తుంది. పాలనలో కావాల్సిన లక్షణాలను ఈ గుమ్మం గుర్తుచేస్తుంది.

గరుడ ద్వారం..

మూడవ ద్వారానికి గరుడ అనే పేరు పెట్టారు. పక్షుల రాజు గరుడ.. విష్ణువు వాహనంగా నమ్ముతారు. హిందూ త్రిమూర్తులలో సంరక్షకుడు అయిన విష్ణువుతో దానికి అనుబంధం ఉంది. గరుడను శక్తి, ధర్మం (కర్తవ్యం)నికి చిహ్నంగా భావిస్తారు. ఇది అనేక దేశాల చిహ్నాలపై ఎందుకు ఉపయోగించారో కూడా వివరణ ఉంటుంది. గరుడ ద్వారం కొత్త పార్లమెంటు భవనానికి తూర్పు ద్వారం.

మకర ద్వారం..

నాలుగో ద్వారం మకర ద్వారం. మకరాన్ని సముద్ర చేపగా పిలుస్తారు. వివిధ జంతువుల కలయికగా దీన్ని గుర్తిస్తారు. దక్షిణ, ఆగ్నేయాసియాలో విస్తరించి ఉన్న హిందూ, బౌద్ధ స్మారక కట్టడాలలో మకరం సాధారణంగా కనిపిస్తాయి. మకరం వివిధ జీవుల కలయికగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. గుమ్మాల వద్ద మకర శిల్పాలు రక్షకులుగా కనిపిస్తాయి. మకర ద్వారం పాత పార్లమెంట్ భవనం ప్రవేశ ద్వారం వైపు ఉంది.

శార్దూల ద్వారం..

ఐదవ ద్వారం శార్దూలం. ఇది సింహం శరీరం, కానీ గుర్రం, ఏనుగు లేదా చిలుక తల. కొత్త పార్లమెంట్ భవనం గేటుపై శార్దూల ఉండటం దేశ ప్రజల శక్తిని సూచిస్తుందని ప్రభుత్వ నోట్ పేర్కొంది.

హంస ద్వారం

పార్లమెంటు ఆరవ ద్వారానికి హంస ద్వారం అని పేరు పెట్టారు. హంస అనేది హిందూ జ్ఞాన దేవత అయిన సరస్వతి వాహనం. హంస మోక్షాన్ని సూచిస్తుంది. జనన, మరణ చక్రం నుంచి ఆత్మ విముక్తిని సూచిస్తుంది. పార్లమెంటు గేటుపై ఉన్న హంస శిల్పం స్వీయ-సాక్షాత్కారానికి, జ్ఞానానికి చిహ్నం.