New Delhi, July 20: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Sessions) గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, దేశంలో పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, ఉమ్మడి పౌరసృ్మతి, మణిపూర్ హింస, ఢిల్లీ ఆర్డినెన్స్ తదితర అంశాలు పార్లమెంట్ ఉభయసభలను (Parliament Sessions) కుదిపేయనున్నాయి. కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై మోదీ సర్కార్‌ను నిలదీసేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు గురువారం ఉదయం సమావేశమై, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నాయి. రెండు నెలలుగా కొనసాగుతున్న మణిపూర్ హింసలో 160 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ప్రధాని మోదీ మౌనం వీడాలని, ప్రధానంగా విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉన్నది. దీనికి తోడు, ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను చాలా పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం బుధవారం అఖిలపక్ష సమావేశం (All Party Meet) నిర్వహించింది. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలతోపాటు మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలని కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. మణిపూర్ హింసపై రెండు నెలలుగా నోరు విప్పని ప్రధాని మోదీ.. కనీసం పార్లమెంట్‌లోనైనా ప్రకటన చేయాలన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, ఆగస్టు 11 వరకు జరుగుతాయి. ఈ దఫా సమావేశాల్లో కేంద్రం 31 బిల్లులను పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నది. ఇందులో ఢిల్లీ ఆర్డినెన్స్, వ్యక్తిగత డాటా పరిరక్షణ, అటవీ పరిరక్షణ చట్టాల సవరణ, సినిమా పైరసీని అరికట్టడం వంటి బిల్లులు ఉన్నాయి.