New Delhi, Dec 22: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament Winter Session) నేటితో ముగిశాయి. ఉభయ సభలు నిరవధిక వాయిదా (Lok Sabha, Rajya Sabha adjourned sine die) పడ్డాయి. లోక్‌సభలో 18 గంటల 48 నిమిషాల పాటు శీతాకాల సభా సమయం వృధా అయినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అయినా కీలకమైన బిల్లుల గురించి చర్చ జరిగిందన్నారు. ఆ బిల్లుకు ఆమోదం కూడా పొందినట్లు ఆయన చెప్పారు. లోక్‌సభలో ఒమిక్రాన్, వాతావరణ మార్పులతో పాటు ఇతర ముఖ్య అంశాలపై చర్చ జరిగినట్లు ఓం బిర్లా తెలిపారు. మరో వైపు రాజ్యసభను కూడా నిరవధిక వాయిదా వేశారు.
రాజ్యసభలో చైర్మెన్ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. శీతాకాల సమావేశాలు అంచనాలకు తగిన రీతిలో జరగలేదన్నారు. నిజానికి ఈ సమావేశాలు మరింత బాగా జరగాల్సి ఉందని, ఎక్కడ తప్పు జరిగిందో సభ్యులో ఆత్మావలోకనం చేసుకోవాలన్నారు. సభ్యులకు క్రిస్మస్, న్యూఇయర్ గ్రీటింగ్స్‌ను తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29న ప్రారంభం అయ్యాయి. వాస్తవానికి డిసెంబర్ 23వ తేదీ వరకు జరగాల్సి ఉంది. కానీ ఒక రోజు ముందే సమావేశాలను నిరవధిక వాయిదా వేశారు.
ఓటర్ ఐడీని ఆధార్‌తో అనుసంధానించడం సహా కీలక సంస్కరణలున్న ఎన్నికల చట్టాల సవరణ బిల్లు– 2021కి రాజ్యసభ మంగళవారం మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. బిల్లుపై నిరసనలు వ్యక్తం చేసిన విపక్షాలు వాకౌట్ చేశాయి. సోమవారం ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభ ఆమోదం లభించడంతో తదుపరి దీన్ని రాష్ట్రపతి వద్దకు పంపుతారు. గతంలో పలు పార్టీల అభిప్రాయాలను సేకరించిన ఎన్నికల కమిషన్ ఈ అనుసంధాన సూచన చేసింది. బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాలు నిరసనకు దిగాయి.