Mumbai, November 23: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలె (NCP's Supriya Sule) తన వాట్సాప్ స్టేటస్ (WhatsApp Status)లో ఓ ఆసక్తికర విషయాన్ని పేర్కొన్నారు. 'పార్టీతో పాటు కుటుంబంలోనూ చీలిక వచ్చింది'(Party And Family Split) అని అన్నారు. ఈ వాట్సప్ స్టేటస్ ఆమెదేనని ఆమె కార్యాలయ సిబ్బంది కూడా నిర్ధారించారు.
ఈ సంధర్భంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్( Ajit Pawar was sworn in as Deputy Chief Minister )పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అజిత్ ఓ మోసగాడని.. తాజా పరిణామాలతో కుటుంబంలోనూ, పార్టీలోనూ చీలిక ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రియా సూలే ఓ పత్రికతో మాట్లాడుతూ.. తన తండ్రి శరద్ పవార్ ఈ పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ అజిత్‌తో తన తండ్రి ఉండరని తేల్చి చెప్పారు. తాజా ఎన్నికల్లో కఠినశ్రమ, అంకితభావంతో తన తండ్రి యోధుడిలా పోరాడారని.. పార్టీని నిలబెట్టారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఎన్సీపీ కార్యకర్త పార్టీకి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే అజిత్ పవార్ మీద పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయింది. ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా ఉన్న అజిత్ పవార్ ను ఆ హోదా నుంచి తొలగించే యోచనలో శరద్ పవార్ (NCP party chief Sharad Pawar) ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.