
Pune, March 06: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పుణె మెట్రో రైలు ప్రాజెక్టును (Metro Rail project) ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా టికెట్ కొనుగోలు చేసి మెట్రో రైలులో గర్వేర్ స్టేషన్ (Garwere) నుంచి ఆనంద్ నగర్ (Anand Nager) వరకు ప్రయాణం చేశారు. మోదీతోపాటు విద్యార్థులు కూడా ఉన్నారు. రైలులో తన పక్కన కూర్చున్న విద్యార్థులతో ప్రధాని సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రధాని మోదీ కార్యాలయం ట్విటర్‌లో పోస్టు చేసింది. ఈ మేరకు "మెట్రో ద్వారా పూణె ప్రజలకు అనుకూలమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుతుంది." అంటూ ట్వీట్ చేసింది. వీటిలో చిన్నారులతో కలిసి ప్రధాని మెట్రో రైల్లో కూర్చొని కనిపిస్తున్నారు. కాగా మొత్తం 32.2 కిలోమీటర్ల పుణె మెట్రో రైలు ప్రాజెక్టులో ప్రస్తుతం 12 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తవడంతో అందుబాటులోకి వచ్చింది.
Ensuring convenient and comfortable travel for the people of Pune.
PM @narendramodi inaugurated the Pune Metro and travelled on board with his young friends. pic.twitter.com/154a2mJk8f
— PMO India (@PMOIndia) March 6, 2022
ప్రస్తుతానికి మెట్రో రైళ్లు రెండు మార్గాల్లో పనిచేస్తాయి. దీంతో వనజ్ నుంచి గార్వేర్ కాలేజ్ మెట్రో స్టేషన్ వరకు.. అలాగే, పీసీఎంసీ నుంచి ఫుగెవాడి మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రయాణికులను మాత్రమే రైళ్లలోకి అనుమతించనున్నారు. అయితే పూణే మెట్రో ప్రాజెక్ట్ మొత్తం వ్యయం ₹ 11,400 కోట్లు కాగా 2016 డిసెంబర్ 24న ఈ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేశారు.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ పుణెలో ఒలెక్ట్రా గ్రీన్ టెక్(Olectra Greentech) సంస్థ తయారు చేసిన 150 విద్యుత్ బస్సులకు(Electric Buses) పచ్చజెండా ఊపి ప్రారంభించారు. మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా కంపెనీ సబ్సిడరీ కంపెనీ అయిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెండ్ ఈ బస్సులను దేశీయంగా తయారు చేసింది. వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని బస్సులతో పాటు బనార్ లోని వాటి ఛార్జింగ్ స్టేషన్లను సైతం ప్రారంభించారు. పూణెలోని ప్రజా రవాణా అవసరాలకోసం ప్రవేశపెట్టిన 150 ఎలక్ట్రిక్ బస్సులను మోదీ ప్రజలకు అంకింతం చేశారు.
దేశంలో ప్రజలందరూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని, మెుబిలిటీని ప్రోత్సహించాలని సూచించారు. దీని ద్వారా డీజిల్ పెట్రోల్ ధరల పెంపును అధిగమించటమే కాక కర్భన్ ఉద్ఘారాలను సైతం తగ్గించవచ్చని అన్నారు. ఇప్పటికే సూరత్, ముంబై, పుణె, సిల్వాసా, గోవా, నాగ్‌పూర్, హైదరాబాద్, డెహ్రాడూన్‌లలోనూ ఒలెక్ట్రా బస్సులు నడుస్తున్నాయి. ఇప్పటికే పూణె ప్రజా రవాణాలో 150 ఎలక్ట్రిక్ వాహనాలు ఉండగా.. తాజాగా మరో 150 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చారు.
బస్సులు 12 మీటర్ల పొడవు, పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ సౌకర్యంతో.. 33 మంది సీటింగ్ కెపాసిటీని కలిగి ఉన్నాయని సంస్థ తెలిపింది. బస్సులో అమర్చిన లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని తెలిపారు. అధిక-పవర్ AC & DC ఛార్జింగ్ సిస్టమ్ బ్యాటరీని 3-4 గంటల్లో రీఛార్జ్ చేయడానికి వెసులుబాటు కల్పిస్తుందని తెలిపింది. దీనికి తోడు బస్సులో భద్రతలో భాగంగా ఎలక్ట్రానిక్‌గా నియంత్రించబడే ఎయిర్ సస్పెన్షన్, CCTV కెమెరాలు, ఎమర్జెన్సీ బటన్‌లు ఉన్నాయని పేర్కొంది.