PM Modi Jammu Visit: జమ్మూ కశ్మీర్‌లో రూ. 32 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసిన ప్రధాని మోదీ, బీజేపీ 370 సీట్లు గెలవడంలో పాత్రులు కావాలని ప్రజలకు పిలుపు
Credits: X

Sri Nagar, Feb 20: జమ్మూ కశ్మీర్‌లో ఈ రోజు ప్రధాని మోదీ పర్యటించారు. అక్కడ 32 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. కొన్నేళ్లుగా జమ్ము కశ్మీర్‌ను ఎవరూ పట్టించుకోలేదని.. ఇవాళ ఇక్కడి నుంచి అభివృద్ధి పనుల్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

జమ్మూకశ్మీర్ అనేక దశాబ్దాలుగా రాజవంశ రాజకీయాల బాధితురాలిగా ఉందన్నారు. వంశపారంపర్య రాజకీయాలు చేస్తున్న వారు తమ ప్రయోజనాల కోసం మాత్రమే చూసుకున్నారు తప్ప మీ ప్రయోజనాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. వంశపారంపర్య రాజకీయాల వల్ల ఎక్కువగా నష్టపోయింది యువతేనని వెల్లడించారు. తమ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తులు మీ కుటుంబం గురించి చింతించరని చెప్పారు.

ప్రధాని మోదీ జమ్మూ పర్యటన, అప్రమత్తమైన భద్రతా బలగాలు, అన్ని పాయింట్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు, రూ. 30,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేయనున్న ప్రధాని

ఆర్టికల్ 370ని ప్రధాని మోదీ గోడతో పోల్చారు. ఆ గోడను బీజేపీ(BJP) ప్రభుత్వం తొలగించిందని చెప్పారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ సమతుల్య అభివృద్ధి దిశగా కొనసాగుతోందన్నారు. ఈరోజు వందలాది మంది యువతకు ప్రభుత్వ నియామక పత్రాలు అందజేశామని మోదీ గుర్తు చేశారు. ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్‌ ఈ వంశపారంపర్య రాజకీయాల నుంచి విముక్తి లభిస్తుందన్న సంతృప్తి ఉందన్నారు.

మంగళవారం జమ్మూ నుంచి ఐఐటీ, ఐఐఎం, నవోదయ లాంటి విద్యాసంస్థలను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దేశంలోని 20 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 13 కొత్త నవోదయ విద్యాలయ భవనాలను కూడా మోదీ ప్రారంభించారు. జమ్ము కశ్మీర్‌ నుంచి ఇలాంటి కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉంది. జమ్ముకశ్మీర్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. త్వరలో వికసిత్‌ కశ్మీర్‌కల సాకారం అవుతుంది. మోదీ గ్యారెంటీ అంటే ఇలా ఉంటుంది అని అన్నారు.

దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం (T-50) అందుబాటులోకి వచ్చింది. జమ్మూ-కశ్మీర్‌లో ఉధంపుర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బనిహాల్- ఖడీ- సుంబడ్‌- సంగల్‌దాన్‌ సెక్షన్‌ (48.1 కి.మీ.)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మంగళవారం ప్రారంభించారు. ఈ మార్గంలోనే ఖడీ- సుంబడ్‌ల మధ్య ‘టీ-50’ సొరంగం వస్తుంది. బారాముల్లా- శ్రీనగర్‌- సంగల్‌దాన్‌ మార్గంలో రెండు విద్యుత్‌ రైళ్లకూ జమ్మూ నుంచి వర్చువల్‌గా పచ్చజెండా ఊపారు. కశ్మీర్‌ లోయలో ఎలక్ట్రిక్‌ రైళ్లను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.

జమ్మూ కాశ్మీర్‌లో సామాజిక న్యాయం కొత్త అధ్యాయం ప్రారంభమైంది. గుజ్జర్లు, పహారీలు, ఎస్టీలు, ఎస్సీలు, కాశ్మీరీ పండిట్లు, పశ్చిమ పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులు రాష్ట్రంలో తమ హక్కులను పొందారని గుర్తు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలువడంలో ఇక్కడి ప్రజలు తమవంతు పాత్ర పోషించాలని ప్రధాని కోరారు.