New Delhi, June 30: భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనాపై పోరాటం చేస్తూ చేస్తూ అన్‌లాక్-2 దశలోకి ప్రవేశించినట్లు ఆయన తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల జలుబు, జ్వరం వచ్చే మాసంలోకి ఎంటరయ్యామని..ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ (PM Modi) దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా మృతుల (Corona Deaths) నివారణలో భారత్ మెరుగ్గా ఉందన్నారు. లాక్‌డౌన్ సరైన సమయంలో చేపట్టడం, ఇతర నిర్ణయాల వల్ల లక్షలాది మంది భారతీయుల ప్రాణాలను రక్షించుకోగలిగామన్నారు. పెళ్లయిన 2 రోజులకే వరుడిని కరోనా కాటేసింది, బీహార్‌లో పెళ్లికి వచ్చిన వారిలో 95 మందికి కోవిడ్-19, దేశంలో తాజాగా 18,522 పాజిటివ్ కేసులు నమోదు
ప్రధాని గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని ( Pradhan Mantri Garib Kalyan Ann Yojana) పొడిగిస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. నవంబర్ ఆఖరు వరకు ఉచిత రేషన్ (Free Foodgrains) కొనసాగించనున్నట్టు తెలిపారు. జూలై నుంచి నవంబర్ వరకు 80 కోట్ల మందికి రేషన్ ఇస్తామని తెలిపారు. నెలకు 5 కిలోల బియ్యంతోపాటుగా, కిలో పప్పు అందజేస్తామని తెలిపారు. రూ. 90 వేల కోట్ల వ్యయంతో 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు వెల్లడించారు.
రేపటి నుంచి అన్‌లాక్ 2.0 నిబంధనలు (Unlock 2 Guidelines) అమల్లోకి రానున్న విషయం విదితమే. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కంటైన్‌మెంట్ జోన్లపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. అన్‌లాక్ 1.0 ప్రారంభమైనప్పటి నుంచి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొద్దిరోజుల నుంచి మాస్కులు ధరించడంలో ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు నిబంధనలను చాలా కఠినంగా పాటించారు. మళ్లీ ఒకసారి రాష్ట్రప్రభుత్వాలు నిబంధనలను కఠినంగా చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఒక దేశ ప్రధాని మాస్కు పెట్టుకోలేదని రూ.13వేలు జరిమానా విధించారు. మన ప్రభుత్వాలు కూడా ఇదే స్ఫూర్తితో కఠినంగా వ్యవహరించాలి. దేశంలో ఏ ఒక్కరూ చట్టానికి అతీతులు కారు. లాక్‌డౌన్ సందర్భంగా ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని ప్రభుత్వాలు పనిచేశాయి. దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్ అందించాం. రాబోయేది పండగల సీజన్ కావున ప్రజలకు అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే జూలై నుంచి నవంబర్ వరకు 80 కోట్ల పేదలకు ఉచితంగా రేషన్ ఇస్తాం. 5 కిలోల బియ్యంతోపాటు కిలో పప్పు అందజేస్తాం.గరీబ్ కల్యాణ్ యోజన పొడిగింపు కోసం రూ.90వేల కోట్లు చేస్తున్నాం. పన్ను చెల్లించే ప్రతి భారతీయుడి వల్లే... ఈరోజు ఇంతమంది పేదలకు సాయం చేయగలుగుతున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆర్థిక కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలి’అని తెలిపారు.
జాతిని ఉద్దేశించి మాట్లాడటానికి ముందు నేటి ఉదయం ప్రధాని మోదీ .. కోవిడ్19 వ్యాక్సిన్‌పై ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్ సమయంలో మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం ఇది ఆరవసారి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మే 12వ తేదీన ఆయన చివరిసారి 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.