Atal Tunnel Inaugurated by PM Narendra Modi (Photo Credits: ANI)

Rohtang, October 3: హిమాచల్‌ ప్రదేశ్‌ రోహ్‌తాంగ్‌ పాస్‌ వద్ద నిర్మించిన అటల్‌ సొరంగమార్గాన్ని (Atal Tunnel Inaugurated) ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. మనాలీ -లేహ్‌ (Manali to Lahaul-Spiti Tunnel) మధ్య దీనిని నిర్మించారు. ఫిర్‌ ఫంజల్‌ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 3 వేల మీటర్లు అంటే 10 వేల అడుగుల ఎత్తులో ఈ టన్నెల్‌ను నిర్మించారు. 9.02 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగ మార్గానికి మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టారు. ప్రపంచంలోనే ఎతైన ప్రాంతంలో చేపట్టిన ఈ టన్నెల్‌ నిర్మాణానికి రూ.3,500 కోట్లు వెచ్చించారు. భౌగోళిక పరిస్థితులు, వాతావారణం కారణంగా నిర్మాణం పనులు ఆలస్యమయ్యాయి.

కాగా జూన్‌ 3, 2000 సంవత్సరంలో నాటి ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పేయ్‌ (Atal Bihari Vajpayee) ఈ టన్నెల్‌ నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. మే 26, 2002లో దీని నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. రోహ్‌తాంగ్‌ టన్నెల్‌కు 2019లో అటల్‌ టన్నెల్‌గా పేరు మారుస్తూ కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. టన్నెల్‌ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రధాన సంస్థ అఫ్‌కోన్స్‌ (ఏఎఫ్‌సీఓఎన్‌ఎస్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ పరమశివన్‌ మాట్లాడుతూ.. జాతీయ రక్షణా కోణం దృష్ట్యా, అంతర్జాతీయంగానూ ఈ టన్నెల్‌ చాలా ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. అతి ఎతైన ప్రాంతంలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైనదిగా దీనికి గుర్తింపు ఉందని ఆయన పేర్కొన్నారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌ జ‌న‌ర‌ల్ ఎం.ఎం. నారావ‌నే తదితరులు ప్రధాని వెంట ఉన్నారు.

వ్యాక్సిన్‌ ఇప్పట్లో రావడం అనుమానమే, లక్ష దాటిన మరణాల సంఖ్య, దేశంలో తాజాగా 79,476 మందికి కరోనా, 54,27,707 మంది డిశ్చార్జ్, యాక్టివ్‌గా 9,44,996 కేసులు

ప్రధాని (Narendra Modi) మాట్లాడుతూ..అటల్‌ టన్నెల్‌ నిర్మాణం పూర్తి చేసి వాజ్‌పేయి స్వప్నాన్ని సాకారం చేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సొరంగమార్గం అందుబాటులోకి రావడంతో కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని.. మనాలీ-లేహ్‌ మధ్య ప్రమాణానికి 3 నుంచి 4 గంటల సమయం ఆదా అవుతుందని ప్రధాని తెలిపారు. ఢిల్లీ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం తగ్గుతుందని ప్రధాని అన్నారు. సరిహద్దులకు అదనపు బలం సైతం చేకూరుతుందని పేర్కొన్నారు.

అతి ఎతైన ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపొడవైన ఈ టన్నెల్‌ను ఎంతో వేగంగా నిర్మించాం. 26 ఏళ్లలో జరగాల్సిన పనిని కేవలం ఆరేండ్లలో పూర్తి చేశామని చెప్పారు. సరిహద్దులో అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. లద్దాఖ్‌లోని దౌలత్‌బాగ్‌ ఓల్డీలో మౌలిక వసతులు కల్పించాం. విమానాలు, హెలికాప్టర్లు దిగేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. రహదారుల అనుసంధానం దేశ ప్రగతిలో ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు. ఎన్నోకష్టాలకు, వ్యయప్రయాసల కోర్చి టన్నెల్‌ను నిర్మించామని వెల్లడించారు. నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లను, సిబ్బందిని, అధికారులను ఆయన అభినందించారు.