New Delhi, Nov 12: ఆర్‌బీఐ నూతనంగా తీసుకొచ్చిన రెండు పథకాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) శుక్రవారం ప్రారంభించారు. ఆర్బీఐ రిటేల్ డైరెక్ట్ స్కీమ్‌తో పాటు రిజర్వ్ బ్యాంక్-ఇంటగ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ స్కీమ్‌ను (Integrated Ombudsman Scheme) ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కస్టమర్ కేంద్రీకృతమైన ఈ రెండు కొత్త స్కీమ్‌ల వల్ల పెట్టుబడుల రంగం విస్తరిస్తుందన్నారు. దీంతో మూలధన మార్కెట్ మరింత సులువు అవుతుందని, రక్షణాత్మకంగా మారుతుందన్నారు. ప్రభుత్వ సెక్యూర్టీ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఈ కొత్త స్కీమ్‌లకు చిన్న ఇన్వెస్టర్లకు డైరెక్ట్ యాక్సిస్ ఉంటుందని మోదీ తెలిపారు. స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కోసం బలమైన బ్యాకింగ్ వ్యవస్థ అవసరమని ప్రధాని చెప్పారు. సులభతరమైన పెట్టుబడులతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థపై సామాన్యుల నమ్మకం చాలా కీలకమన్నారు. గడిచిన ఏడేళ్లలో ఎన్పీఏలను చాలా పారదర్శకంగా చూశామని, తీర్మానాలు.. రికవరీలపై దృష్టిపెట్టామని, ఈ సంస్కరణలతో బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతమవుతోందన్నారు.
ఈ దశాబ్దం దేశాభివృద్ధికి చాలా ముఖ్యమైనది. ఇందులో ఆర్‌బీఐ పాత్ర కూడా చాలా పెద్దది. అందుకు అనుగుణంగానే ఆర్‌బీఐ బృందం దేశం యొక్క అంచనాలను అందుకోగలదని నమ్మకం ఉందని తెలిపారు. రిటైల్ డైరెక్ట్ పథకంతో, దేశంలోని చిన్న పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడికి సులభమైన, సురక్షితమైన మార్గాన్ని అందించింది. ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ పథకం, వన్ నేషన్ వన్ అంబుడ్స్‌మన్ సిస్టమ్ (One Nation-One Ombudsman) ఈ రోజు బ్యాంకింగ్ రంగంలో రూపుదిద్దుకుంది. ఈ రోజు ప్రారంభించబడిన రెండు పథకాలు దేశంలో పెట్టుబడి పరిధిని విస్తరింపజేస్తాయి. ఈ పథకాలు మరింత సురక్షితమైనవి. పెట్టుబడిదారులకు క్యాపిటల్ మార్కెట్‌లను యాక్సెస్ చేయడాన్ని సులభతరం చేస్తాయి' అని ప్రధాని మోదీ అన్నారు.
ప్రారంభోత్సవంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి సమయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖతో రిజర్వ్ బ్యాంక్ పనిచేసిన విధానాన్ని అభినందించారు.