New Delhi, April 27: దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi ) అన్ని రాష్ట్రాల ముఖ‍్యమంత్రులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో (PM Modi VC) పాల్గొన్నారు. దేశంలో కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొడానికి మనమంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగానే దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలపై మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలపై మోదీ స్పందిస్తూ.. ‘‘కొన్ని రాష్ట్రాలు మాత్రమే పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించాయి. ఇప్పటికైనా పన్నులు తగ్గించాలని మిగతా రాష్ట‍్రాలను కోరుతున్నా. సమాఖ్య స్ఫూర్తితో పెట్రోల్‌పై పన్నులు తగ్గించండి. అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా ఉత్తరాఖండ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104 ఉండగా.. ఎక్కువగా మహారాష్ట్రలో లీటర్ రూ. పెట్రోల్ ధర రూ. 122గా ఉందని’’ తెలిపారు.
కాగా చమురు ధరలకు కళ్లెం పడడం లేదు. రోజురోజుకు ధరలు పెరిగిపోతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్ కు తోడుగా డీజిల్ ధరలు కూడా అధికమౌతున్నాయి. దీంతో దీనిపై ఆధార పడిన ఇతర వస్తువుల ధరలు కూడా చుక్కలంటుతున్నాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమంటూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ ఎందుకు తగ్గించడం (PM Narendra Modi urges states to cut tax) లేదన్నారు. ఏపీ, బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాలు పెట్రోల్ పై వ్యాట్ తగ్గించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ పై వ్యాట్ తగ్గించాలని సూచించారు. అప్పుడే ప్రజలపై భారం తగ్గుతుందని తెలిపారు.
ఇక కరోనాపై పీఎం మోదీ మాట్లాడుతూ.. ‘‘కొద్ది రోజులుగా దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో కోవిడ్ సంక్షోభాన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కొన్నప్పటికీ కేసులు పెరుగుతుండటం ఆందోళనకర అంశం. మనమంతా అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ సవాలును అధిగమించాలి. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయం చాలా ముఖ్యం..దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మన దేశ వయోజన జనాభాలో 96% మంది మొదటి డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైంది.’’ అని అన్నారు.