AAP Chief Arvind Kejriwal (Photo Credit: X/ ANI)

New Delhi, March 22: ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను లిక్కర్‌ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్‌ చేయడంపై ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌ (Sunita Kejriwal) శుక్రవారం స్పందించారు. ప్రధాని మోదీ అధికార దురహంకారమని ఆరోపించారు. అందరినీ అణిచివేసేందుకు మోదీ (Modi) ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను (Kejriwal Arrest) అరెస్ట్‌ చేయడం ఢిల్లీ ప్రజలకు ద్రోహం చేయడమేనని అన్నారు. కాగా, సునీతా కేజ్రీవాల్‌ ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్ట్‌ చేశారు. ‘మూడుసార్లు ఎన్నికైన మీ ముఖ్యమంత్రిని మోదీ అధికార అహంకారంతో అరెస్టు చేశారు. అందరినీ అణిచివేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇది ఢిల్లీ ప్రజలకు చేసిన ద్రోహం. మీ ముఖ్యమంత్రి ఎప్పుడూ మీ వెంటే ఉన్నారు. జైలు లోపల అయినా బయట అయినా, ఆయన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. ప్రజలే సుప్రీం. ప్రతిదీ వారికి తెలుసు. జై హింద్’ అని హిందీలో ట్వీట్‌ చేశారు.

 

మరోవైపు అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది. మద్యం పాలసీ స్కామ్‌లో ఆయన కీలక కుట్రదారుడని ఆరోపించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22ను రూపొందించి అమలు చేసేందుకు ‘దక్షిణాది గ్రూప్‌’ నుంచి అనేక కోట్లు ముడుపులుగా స్వీకరించారని తెలిపింది. దీనిపై విచారణ కోసం అరవింద్‌ కేజ్రీవాల్‌ను పది రోజులు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును ఈడీ కోరింది. అయితే ఈ నెల 28 వరకు ఆరు రోజులపాటు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది.