Bengaluru, May 31: అశ్లీల వీడియో కేసులో ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు కోర్టు 6 రోజుల సిట్ కస్టడీకి అప్పగించింది. అయితే 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిట్ కోర్టును కోరింది. ఆరు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది. రేపటి నుంచి ఆరు రోజులు ఆయనను సిట్ పోలీసులు విచారిస్తారు. రేవణ్ణను మిస్సింగ్ మొబైల్ ఫోన్ విషయమై ఆరా తీయనున్నారు. ఫోన్, డేటా రికవరీ చేయాల్సి ఉంది.
లోక్‌సభ ఎన్నికలు మధ్యలో ఉండగా లైంగిక దాడుల ఆరోపణల వీడియోలు వెలుగుచూడటంతో జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ ఎట్టకేలకు మునిచ్ నుంచి గురువారం అర్థరాత్రి బెంగళూరు చేరుకున్నారు. ప్రజ్వల్ రేవణ్ణను కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిట్ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. నెల రోజులకు పైగా విదేశాల్లో తలదాచుకున్న రేవణ్ణ బెంగళూరు రాగానే ఐదుగురు మహిళా పోలీసులు అతనిని అరెస్ట్ చేసి హెడ్‌మూరికట్టిలోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి జర్మనీ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన ప్రజ్వల్ రేవణ్ణ.. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన పోలీసులు
పలువురు మహిళలపై లైంగిక దాడులు జరిపిన ఆరోపణలను ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు శుక్రవార ఉదయం వైద్య పరీక్షలు జరిపారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) పలువురు మహిళా పోలీసు అధికారుల ఎస్కార్ట్‌తో స్థానిక బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. మహిళలపై లైంగిక దాడుల ఆరోపణలు ఉండటంతో ఆయనకు లైంగిక సామర్థ్య పరీక్షలు (potency) కూడా నిర్వహించారని తెలుస్తోంది.
ఇక మైసూరు జిల్లా కేఆర్ నగర్ నుంచి ఒక మహిళ అపహరణకు సంబంధించి ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ (Bhavani Revanna)కు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) నోటీసు పంపింది. జూన్ 1న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కిడ్నాప్ కేసులో విచారణకు హాజరుకావాలని ఇంతకుమందు కూడా భవానీ రేవణ్ణకు 'సిట్' నోటీసులు పంపింది. 1000 మందికి పైగా అమ్మాయిలతో సెక్స్ ఆరోపణలు, ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేసిన జేడీఎస్ పార్టీ, సెక్స్ వీడియోల లీక్ వెనుక డీకే శివకుమార్..
అయితే, ఈ కేసులో విచారణకు తాను సహకరించేందుకు సిద్ధమేనని, హోలెనర్సిపూర్‌లోని చెన్నైంబికా నివాసంలో తాను అందుబాటులో ఉంటానని సిట్‌కు ఆమె సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సిట్ తాజా నోటీసులు పంపింది. మహిళా అధికారులతో తమ టీమ్ హోలెనర్సిపూర్‌కు వస్తుందని, శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ అందుబాటులో ఉండాలని ఆ నోటీసులో పేర్కొంది.
మరోవైపు, కిడ్నాప్ కేసులో తనకు ముందస్తు బెయిలు ఇవ్వాలని బెంగళూరులోని ప్రత్యేక కోర్టును భవానీ రేవణ్ణ ఆశ్రయించారు. ముందస్తు బెయిలు అభ్యర్థనను కోర్టు తిరస్కరించినట్లయితే 'సిట్' విచారణ అనంతరం ఆమెను 'సిట్' అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.